Altered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు
మానవ శరీరానికి మెదడు సీపీయూ లాంటిది. మనిషి ఆలోచనలు, కదలికలు, అనుభూతులను మెదడు నియంత్రిస్తుంది. అయితే మెదడు పనితీరు బలహీనమైనప్పుడు మన ప్రవర్తనలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ రకమైన స్థితినే 'ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్(ఏఎంఎస్)' అని అంటారు. ఏఎంఎస్ వల్ల మెదడు పనితీరులో అంతరాయం కలుగుతుంది. ఫలితంగా బాధితుడి ప్రవర్తన, ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. ఇది వెంటనే జరగవచ్చు, లేదా రోజుల వ్యవధిలో జరగవచ్చు. మొదడుపై పడే ప్రభావాన్ని బట్టి ఏఎంఎస్ బారిన పడిన వాళ్లు కోమాలోకి కూడా వెళ్లవచ్చు. ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్ అనేది మెదడును ప్రభావితం చేసే కొన్ని రుగ్మతల వల్ల గానీ, గాయాల వల్ల కానీ ఉత్పన్నమవుతుంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా కావొచ్చు.
'ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్' అనేది మూడు రకాలు- డెలిరియం, డిమెన్షియా, సైకోసిస్
ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. అవి డెలిరియం(మతిమరుపు), డిమెన్షియా(చిత్తవైకల్యం), సైకోసిస్(సైకోసిస్). మతిమరుపు: మానసిక పనితీరులో మార్పు తరచుగా గందరగోళం, పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం మతిమరుపుగా పేర్కొనవచ్చు. చిత్తవైకల్యం: మానసిక పనితీరు క్షీణించడం వల్ల జ్ఞాపకశక్తి లోపిస్తుంది. ఆలోచించడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. సైకోసిస్: వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోయినప్పుడు, భ్రమలు కలిగి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. మెదడులో రక్తస్రావం, మెదడులో కణితి, మూర్ఛ లేదా స్ట్రోక్ వంటి కేంద్ర నాడీ వ్యవస్థలో సమస్యల కారణంగా ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్ సంభవించవచ్చు. ఔషధాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. తరచుగా డీహైడ్రేషన్, హైపోగ్లైసీమియా వంటి జీవక్రియ రుగ్మతలు ఏఎంఎస్‌కి కారణం కావచ్చు.