LOADING...
Padmashree Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అక్షరాల ఆలయం నిర్మించిన సాధకుడు
20 లక్షల పుస్తకాలతో అక్షరాల ఆలయం నిర్మించిన సాధకుడు

Padmashree Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అక్షరాల ఆలయం నిర్మించిన సాధకుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లే 'మది శారదాదేవి మందిరం' అనిపించేలా అంకెగౌడ జీవితం రూపుదిద్దుకుంది. ఆయనకు మది మాత్రమే కాదు... ఇల్లు మొత్తం సరస్వతీదేవి ఆలయంగా మారింది. కర్ణాటకలోని చిన్న కురళి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన అంకెగౌడ, కాలేజీ చదువుల సమయంలోనే తన జీవిత దిశను మార్చుకున్నారు. అప్పట్లో ఆయన ప్రొఫెసర్‌ అనంతరామ్‌ "ఏదైనా ఒక మంచి అలవాటు అలవర్చుకో" అని సూచించడంతో,పుస్తకాలపై ఉన్న ప్రేమతో వాటిని సేకరించడాన్ని హాబీగా మార్చుకున్నారు. చిన్నగా మొదలైన ఆ అలవాటు కాలక్రమేణా విస్తరించి, ఒక విశాలమైన గ్రంథాలయాన్ని ఆయన సొంతం చేసుకునే స్థాయికి చేరింది.

వివరాలు 

'పద్మశ్రీ' పురస్కారం

మాండ్య జిల్లాలోని హరలహల్లి గ్రామంలో ఉన్న ఆయన నివాసం నేడు సందర్శక కేంద్రంగా మారి, దేశవిదేశాల్లో గుర్తింపు పొందింది. ప్రముఖుల ప్రశంసలతో పాటు తాజాగా ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారం లభించడం విశేషం. అంకెగౌడ తల్లిదండ్రులు మరిగౌడ, నింగమ్మ. ప్రాథమిక విద్యాభ్యాస సమయంలోనే పుస్తకాల కొరతను ఎదుర్కొన్న అనుభవం ఆయనలో లోతైన ముద్ర వేసింది. అదే గురువు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ, బస్‌ కండక్టర్‌గా పనిచేస్తూనే పుస్తకాలను సేకరించడం ప్రారంభించారు. తరువాత ఎంఏ పూర్తి చేసి సుమారు ముప్పయ్యేళ్లపాటు షుగర్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశారు. వయసు పెరిగినా పుస్తకాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు.

వివరాలు 

అల్మారాలు సరిపోక, చాలా పుస్తకాలు గుట్టలుగా నిల్వ

గత 50ఏళ్లలో ఆయన సుమారు 20లక్షల పుస్తకాలు, 25వేల పోస్టల్‌ స్టాంపులు,వంద దేశాలకు చెందిన నాణేలను సేకరించారు. ఈ ప్రయాణంలో భార్య, కుమారుడు కూడా ఆయనకు పూర్తి సహకారం అందించారు. అయితే,ఇంతటి సేకరణను భద్రంగా ఉంచడం పెద్ద సవాలుగా మారింది. అల్మారాలు సరిపోక, చాలా పుస్తకాలు గుట్టలుగా నిల్వ ఉండేవి. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి,సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎన్‌.వెంకటాచలయ్య సహా పలువురు ప్రముఖులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చూసి అభినందించారు. అంకెగౌడ అంకితభావానికి ముగ్ధులైన పారిశ్రామికవేత్త శ్రీహరి ఖోడె,సుమారు ఇరవై ఏళ్ల క్రితం పుస్తకాలను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించి ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన సదానంద గౌడ,కుమారస్వామి కూడా ఆర్థిక సహాయం అందించారు.

Advertisement

వివరాలు 

పలు భాషలకు చెందిన ఐదువేలకుపైగా నిఘంటువులు

భవనమంతా పుస్తకాలకే కేటాయించి, కుటుంబం ఒక చిన్న భాగంలో నివసిస్తూ, అనేక మంది విద్యార్థులు, పరిశోధకులు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంకెగౌడ గ్రంథాలయంలో రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో రచయిత రాసిన వేర్వేరు సంచికలను వెతికి మరీ సేకరించడం ఆయన ప్రత్యేకత. ఆదిశంకరులు,రామానుజులు,మధ్వాచార్యుల రచనలు,ఖురాన్‌తో పాటు ఉర్దూ,పార్సీ భాషా కావ్యాలు, తెలుగు,తమిళ,ఆంగ్ల పుస్తకాలు,తాళపత్ర గ్రంథాలు కూడా ఈ గ్రంథాలయంలో చోటు దక్కించుకున్నాయి. పలు భాషలకు చెందిన ఐదువేలకుపైగా నిఘంటువులు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి కృషితో ఒక్కచోటుకు చేరిన ఈ అపూర్వ గ్రంథ సంపదను కాపాడుకోవడం సమాజ బాధ్యత. ముఖ్యంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి, అమూల్యమైన ఈ జ్ఞాననిధిని తగిన విధంగా సంరక్షిస్తాయని ఆశిద్దాం.

Advertisement