Lacquer figures: శుభకార్యాలకు ప్రత్యేకంగా ఏటికొప్పాక లక్క బొమ్మలు.. సంప్రదాయానికి ప్రతీక!
లక్క బొమ్మలు... చిన్నప్పుడు పిల్లలతోపాటు పెద్దవారిని కూడా మంత్రముగ్ధులను చేసే కళ. ఈ బొమ్మలు పిల్లల ఆటల నుంచి గృహ అలంకరణ దాకా అన్ని రూపాలలోనూ ప్రాచుర్యం పొందాయి. వాటిలో మన సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామంలో తయారయ్యే ఈ లక్క బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. వరహానది పక్కన ఉండే ఈ గ్రామంలో కళాకారులు అంకుడు కర్రతో సహజ రంగులను ఉపయోగించి బొమ్మలను చెక్కుతూ మనసుకు హత్తుకునే కళాఖండాలను రూపొందిస్తారు. చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు 1990 నుంచి రసాయన రంగుల స్థానంలో సహజ రంగులను వాడడం ప్రారంభించారు.
సహజ రంగులతో ఏటికొప్పాక బొమ్మల తయారీ
ఈ మార్పుతో ఏటికొప్పాక బొమ్మలు మరింత సుందరంగా మార్చాయి. అప్పటి నుంచి గ్రామంలోని ఇతర కళాకారులు సహజ రంగుల ప్రయోగాలను అభ్యసించి ఈ బొమ్మల అందాన్ని వంద రెట్లు పెంచారు. ప్రస్తుతం ఈ బొమ్మలు వివాహాలు, గృహప్రవేశాలు, బొమ్మల కొలువు వంటి శుభకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ బొమ్మలకు అవసరమైన లక్కను రాంచీ నుండి దిగుమతి చేసుకుంటారు. లక్కను పసుపు, నేరేడు, ఉసిరి, వేప వంటి సహజ వనసంపదల నుంచి వచ్చే రంగులతో మేళవించి బొమ్మలకు అద్దుతారు.
ప్రతి ఇంట్లోనూ ఓ కళాకారుడు
బొమ్మల తయారీలో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇవి స్థానికంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. ఏటికొప్పాక బొమ్మల తయారీలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటాడు. కవర్‌చేయడం, చెక్కడం, రంగులు అద్దడం వంటి పనులు చేస్తారు. బొమ్మలు, గాజులు, గోడగడియారాలు వంటి వివిధ వస్తువులను ఇక్కడ తయారు చేస్తారు. ఆ గ్రామాన్ని సందర్శించాలనుకునే వారు విశాఖపట్నం నుంచి బస్సు లేదా రైలు ద్వారా ఈ గ్రామానికి చేరుకోవచ్చు.