Climate Change: హీట్ అలర్ట్.. తీవ్ర వేడి ప్రభావంలోనే 78% మంది వృద్ధులు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం మనుషుల రోజువారీ జీవితంపై తీవ్రంగా పడుతున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. యూరప్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ విడుదల చేసిన డేటా ప్రకారం.. యువకులు సంవత్సరానికి సుమారు 50 గంటల వరకు తీవ్రమైన వేడి కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. అయితే వృద్ధులు మాత్రం సంవత్సరానికి దాదాపు 900 గంటల వరకు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైంది.
వివరాలు
దారుణ పరిస్థితుల్లో వృద్ధులు
ఇందులో "లైవబిలిటీ" అంటే శరీరంలో అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యే పరిస్థితుల్లో రోజువారీ శారీరక కార్యకలాపాలను ఆరోగ్యానికి హాని లేకుండా నిర్వహించే సామర్థ్యంగా నిర్వచించారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అటాహ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. వారి విశ్లేషణ ప్రకారం.. ప్రపంచ జనాభాలో 78 శాతం మంది వృద్ధులు (65 ఏళ్లు పైబడిన వారు) సంవత్సరంలో అత్యంత వేడి సమయంలో బయట శారీరక కార్యకలాపాలు చేయడం కష్టమయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అదే సమయంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 35 శాతం మంది కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.