LOADING...
Karthika Masam Deepam: కార్తీక మాసంలో దీపం వెలిగించే విధానం, ఫలితాలు
కార్తీక మాసంలో దీపం వెలిగించే విధానం, ఫలితాలు

Karthika Masam Deepam: కార్తీక మాసంలో దీపం వెలిగించే విధానం, ఫలితాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్తీక మాసం వచ్చినప్పుడల్లా దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు, దేవాలయం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోతుంది. ఈ పవిత్ర మాసంలో దీపం ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ నూనెతో దీపం వెలిగించాలి? స్కాంద పురాణం, తులా పురాణం ప్రకారం కార్తీక మాసంలో దీపం పెట్టేటప్పుడు ఈ మూడు నూనెలలో ఏదో ఒకదాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం: ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె, ఈ మూడింటితో దీపాలు వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇతర నూనెలతో కూడా దీపం వెలిగించవచ్చు కానీ పై మూడు నూనెలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

వివరాలు 

దీపం ఎలా వెలిగించాలి? 

మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఉత్తమం. లేకపోతే పిండి దీపాలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు. పిండి దీపం తయారీ విధానం: బెల్లం తురుము, బియ్యం పిండి, ఆవు పాలు కలిపి చిన్న దీపాల్లా ఆకారం చేయాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఈ దీపాలను ఇంటి గుమ్మం ముందు లేదా దేవాలయ ప్రాంగణంలో.. ముఖ్యంగా శివాలయం,విష్ణువు ఆలయం, లేదా ఏ దేవి, దేవత ఆలయం అయినా.. సాయంత్రం సమయాన వెలిగించడం అత్యంత మంగళకరం.

వివరాలు 

వత్తులు (ఒత్తులు) ఎలా ఉండాలి?

పైడి పత్తితో స్వయంగా వత్తులు తయారు చేసి వాటిని దీపంలో వాడడం శుభప్రదం. స్కాంద పురాణం, తులా పురాణం రెండూ కూడా పైడి పత్తితో చేసిన వత్తులను ఉపయోగించాలని సూచిస్తున్నాయి. యాంత్రికంగా తయారైన లేదా వేరే రకపు వత్తులను వాడకుండా, చేతితో చేసిన పైడి పత్తి వత్తులనే వాడడం ఉత్తమం.

వివరాలు 

దీపం వెలిగించాల్సిన సమయం 

కార్తీక మాసంలో దీపం సాయంత్రం చీకటి పడ్డాక వెలిగించాలి. ఆ సమయంలో వెలిగించిన దీపం చుట్టుపక్కల వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, దానివల్ల పుణ్యం మరింతగా పెరుగుతుంది. దేవాలయంలో దీపం ఎక్కడ వెలిగించాలి? శివాలయంలో అయితే నందీశ్వరుడి సమీపంలో లేదా ధ్వజస్థంభం దగ్గర దీపం వెలిగించాలి. గర్భగుడిలో వెలిగించే అవకాశం ఉంటే అది అత్యంత పుణ్యఫలదాయకం. విష్ణువు ఆలయంలో కూడా ధ్వజస్థంభం దగ్గర దీపం పెట్టడం అత్యుత్తమం. విష్ణువు ఆలయంలో దీపం వెలిగించే సమయంలో ఒక్క అవిస పుష్పం సమర్పిస్తే, విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం ప్రసాదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా కార్తీక మాసంలో భక్తితో, నియమానుసారం దీపాలను వెలిగిస్తే పాపాలు నశించి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి.