Bobbili Veena: మూడొందల ఏళ్లుగా సంగీతాన్ని పలికిస్తున్న బొబ్బిలి వీణలు.. అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు
తెలుగునాట 'వీణ' అంటే అందరూ బొబ్బిలి వైపే చూస్తారు. బొబ్బిలి,విశేషమైన వీణల తయారీకి ప్రఖ్యాతి పొందిన ప్రదేశం. ఈ వీణల ప్రత్యేకత వాటి ధ్వనిలో, స్పష్టతలో ఉంది. బొబ్బిలి వీణలు,పనస చెక్కలతో తయారు చేయడం వలన ప్రత్యేక గుర్తింపు పొందాయి. సాంప్రదాయ వీణల తయారీకి తంజావూరు వంటి ప్రదేశాల్లో మూడు రకాల చెక్కలు వినియోగిస్తే.. బొబ్బిలి వీణలు ప్రత్యేకంగా పనస చెక్కలతో తయారవడం ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత కారణంగా బొబ్బిలి వీణలకు అంతర్జాతీయ ఖ్యాతి ఏర్పడింది. ఇటీవల, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహంలో తెలుగు వీణాగానం ఆకర్షణీయంగా అలరించింది. వీణా విద్వాంసురాలు శ్రీవాణికి దక్కిన అరుదైన గౌరవంతో మరోసారి దేశవ్యాప్తంగా బొబ్బిలి వీణపై చర్చ మొదలైంది.
ఇదీ ప్రస్థానం..
17వ శతాబ్దంలో బొబ్బిలి రాజ్య వ్యవస్థాపకుడు పెద్దరాయుడి కళలపై ఉన్న మక్కువ,బొబ్బిలిలో వీణల తయారీకి బీజం వేసింది. మైసూరుకు ఇద్దరు వడ్రంగులను పంపించి, అక్కడి వీణల తయారీ పద్ధతులను నేర్చుకోవాలని సూచించాడు. ఈ జ్ఞానంతో తిరిగి వచ్చిన అచ్చెన్న, బొబ్బిలి వీణల తయారీకి ప్రేరణ ఇచ్చాడు. బొబ్బిలి రాజులు ఈ వీణల వాయిద్యం వినడం ద్వారా ఎంతో మురిసిపోయినట్లు చెబుతారు. ఆ తర్వాత, విజయనగర ఆస్థానం సహా అనేక రాజులు బొబ్బిలి వీణల కొనుగోలు చేసేవారు. శంకర శాస్త్రి వంటి ప్రముఖ వైణికులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యత ఇచ్చారు. 1850 ప్రాంతంలో వాసా కృష్ణమూర్తి, వాసా సాంబమూర్తి వంటి సంగీత విద్వాంసులు వీణ వాయించడం ద్వారా వాటికి కీర్తి కల్పించారు.
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం, బొబ్బిలి వీణల తయారీ కేంద్రంలో దాదాపు 40 కళాకారులు వీణలను తయారు చేస్తున్నారు. వీణలు తిరుమల తిరుపతి దేవస్థానానికి, పుణ్యక్షేత్రాలకు సరఫరా అవుతున్నాయి. లేపాక్షి సంస్థ వీణలను కొనుగోలు చేసి, పర్యాటక కేంద్రాల్లో విక్రయిస్తోంది. నూజివీడులో కూడా వీణలు తయారు అవుతున్నాయి, ఇవి 120 ఏళ్లుగా ఆదరణ పొందుతున్నాయి. ఉన్నతాధికారులకు, ప్రముఖులకు జ్ఞాపికగా వీణలను అందిస్తున్నారు. 2000లో, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణల గురించి తెలుసుకుని అభినందించారు.
వీణల ప్రత్యేకతలు
కర్ణాటక సంగీత కచేరీలలో వీణను ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఇది ఉత్తరాదిలో రుద్రవీణగా, దక్షిణాదిలో సరస్వతీ వీణగా, మధ్య భారతంలో విచిత్ర వీణగా పిలుస్తారు. వీణలో కుండ, దండి, యాళి వంటి భాగాలు ఉంటాయి. ప్రభుత్వం బొబ్బిలి వీణకు 1980లో జాతీయ అవార్డు, 2011లో జియోగ్రాఫికల్ గుర్తింపు ఇచ్చింది. వీణల తయారీకి పనస చెక్క ముఖ్యమైనది, ఇది తేలికగా ఉండి మంచి ధ్వని ఇస్తుంది.