Custard apple: డయాబెటిస్ ఉన్నవారు 'సీతాఫలం' తినొచ్చా? నిపుణుల సూచనలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకృతి అందించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. బయటకు పెద్దగా ఆకర్షణీయంగా కనిపించకపోయినా, రుచి మాత్రం ఎంతో మధురంగా ఉండే ఈ కొండపండు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంలో సమృద్ధిగా ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఈ పండును తినవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో సీతాఫలం ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
రోగనిరోధక శక్తికి బలం
సీతాఫలంలో విటమిన్ ఎ, సి, బి6తో పాటు కాపర్, పొటాషియం, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుందని The Pharma Innovation Journal పేర్కొంది. అంతేకాకుండా ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు.
Details
గుండె ఆరోగ్యానికి మేలు
సీతాఫలంలో అధికంగా ఉండే మెగ్నీషియం గుండె కండరాలను సడలించి, స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గించడంలో సహకరిస్తుందని Indian Institute of Food Processing Technology అధ్యయనం వెల్లడించింది. ఇందులోని ఫైబర్, నియాసిన్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయని నిపుణుల అభిప్రాయం.
Details
షుగర్ నియంత్రణలో సహాయం
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల సీతాఫలం తినినప్పుడు చక్కెర శోషణ నెమ్మదిగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా టైప్-2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ పండుకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ రోగులకు మేలు చేస్తాయని International Journal of Current Microbiology and Applied Sciences వెల్లడించింది. అయితే, అధికంగా కాకుండా మితంగా, వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Details
గర్భిణీ మహిళలకు
గర్భధారణ సమయంలో వచ్చే వేవిళ్లు, మూడ్ స్వింగ్స్, జీర్ణ సమస్యలను సీతాఫలం తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాపర్ ఎక్కువగా ఉండటంతో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. అలాగే, పిండం అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. గర్భధారణ సమయంలో సీతాఫలం తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు మెదడు, నాడీ వ్యవస్థ, రోగనిరోధక శక్తి అభివృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాపర్ లోపం ఉంటే ముందస్తు ప్రసవ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తూ, గర్భిణీలు సీతాఫలం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
Details
బరువు నియంత్రణకు
సీతాఫలంలో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులోని అధిక ఫైబర్ కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువసేపు ఆకలివేయకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో చిరుతిండ్లకు దూరంగా ఉండి, క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే, ఇందులోని విటమిన్ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
Details
పీసీఓఎస్ ఉన్నవారికి
పీసీఓఎస్ సమస్య ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. సీతాఫలంలో అధికంగా ఉండే ఐరన్ ఈ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల పీసీఓఎస్ ఉన్నవారు ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం మంచిదని, ఇది సంతాన సాఫల్యతను కూడా పెంచుతుందని చెబుతున్నారు.
Details
ఇతర ప్రయోజనాలు
సీతాఫలంలో ఉన్న కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి. బి-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉండటంతో మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇందులోని విటమిన్ సి, రైబోఫ్లేవిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కంటి చూపును మెరుగుపరచడంతో పాటు కంటి సమస్యలను నివారిస్తాయి. డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే, సీతాఫలం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పుకుని అధికంగా తీసుకోవడం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు ఈ పండు తీసుకునే మోతాదుపై సందేహాలుంటే తప్పకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.