
White Hair in Children: చిన్న పిల్లల జుట్టు ఎందుకు తెల్లబడుతోంది? దీనికి కారణాలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు జుట్టు తెల్లబడే సమస్య వృద్ధాప్య లక్షణంగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి బాగా మారిపోయింది.
50 ఏళ్లు దాటాకే కనిపించే తెల్లజుట్టు, ఇప్పుడు యువతతో పాటు చిన్నపిల్లలలో కూడా కనిపిస్తోంది.
ఈ సమస్య పెరిగిపోవడంతో, రంగులు వేసుకొని దాచుకునే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది.
అయితే, ఇప్పటి తరంలో 20-30 ఏళ్ల యువకుల్లో తెల్లజుట్టు కనిపించడం ఓ విషయం అయితే, పదేళ్ల లోపు చిన్నపిల్లల్లో కూడా జుట్టు రంగు మారిపోవడం గమనార్హం.
ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై వైద్య నిపుణులు వివిధ కారణాలను వివరిస్తున్నారు.
వివరాలు
జన్యుపరమైన ప్రభావం
చిన్నపిల్లల్లో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణంగా జన్యుపరమైన ప్రభావాన్ని సూచించాల్సి ఉంటుంది.
తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య ఉంటే, అదే లక్షణం పిల్లల్లోనూ కనిపించవచ్చు.
జుట్టుకు రంగును అందించే మెలనిన్ అనే పదార్థం సరైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పూర్తిగా జన్యుపరమైన గుణల కారణంగా జరిగే ప్రక్రియ.
వివరాలు
పోషకాహారం లోపం
ఈ రోజుల్లో పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం కంటే ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు.
ముఖ్యంగా విటమిన్ B12, కాపర్, ఐరన్, జింక్ లాంటి పోషకాలు లేకపోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
మెలనిన్ తగ్గిపోయినప్పుడే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది.
అందువల్ల పిల్లలకు ఆకుకూరలు, పండ్లు, సజీవ ఆహారం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన పోషకాహారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
వివరాలు
మానసిక ఒత్తిడి
ఇప్పటి చిన్నారుల జీవనశైలి చాలా వేగంగా మారిపోతోంది. చదువులో పోటీ, పరీక్షల భయం, అలాగే సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల పిల్లలు చిన్న వయసులోనే ఒత్తిడికి లోనవుతున్నారు.
పదేళ్ల వయసు నుంచే పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉండటం, తరచుగా వాటిని ఉపయోగించడం వల్ల తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
దీని వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.
ఇది జుట్టు మూలాలను దెబ్బతీసి తెల్లజుట్టుకు దారితీస్తుంది.
కాబట్టి పిల్లలను ఒత్తిడికి దూరంగా ఉంచడమే కాదు, సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించడమూ అవసరం.
వివరాలు
రసాయన ఆధారిత ఉత్పత్తుల ప్రభావం
పాత రోజుల్లో తలస్నానం కోసం కుంకుడుకాయ, శీకాకాయ వంటి సహజ పదార్థాలను ఉపయోగించేవారు.
ఇవి జుట్టుకు హానికరం కానివి. కానీ ఇప్పుడైతే రసాయనాలు మేళవించిన షాంపూలు, కండిషనర్లు వంటి ఉత్పత్తుల వాడకాన్ని ఎక్కువగా చూస్తున్నాం.
వీటిలో సల్ఫేట్, పారాబెన్ లాంటి హానికర రసాయనాలు ఉంటాయి. చిన్నపిల్లల జుట్టు నాజూకు కావడంతో ఈ రసాయనాల ప్రభావానికి త్వరగా లోనవుతుంది.
ఫలితంగా జుట్టు రంగు మారిపోతుంది. అందుకే సహజ పద్ధతులు ఉపయోగించడం ఉత్తమం. కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించడమూ ఆరోగ్యానికి మంచిదే.
వివరాలు
ఆరోగ్య సమస్యలు కూడా కారణం
కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా చిన్నపిల్లల్లో జుట్టు తెల్లబడడానికి కారణమవుతాయి.
ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు, ఆటోఇమ్యూన్ డిసార్డర్లు, బొల్లి వంటి సమస్యలు ఉన్నవారిలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది.
ఈ కారణంగా జుట్టు తన సహజ నలుపు రంగును కోల్పోయి తెల్లబడుతుంది.
పిల్లల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించి సమయానికి చికిత్స తీసుకోవడం అవసరం.