Page Loader
Chedi Talimkhana Celebrations: విజయదశమి సందర్భంగా అమలాపురంలో 'చెడి తాలింఖానా' ఉత్సవం.. ప్రత్యేకతలు ఇవే!
విజయదశమి సందర్భంగా అమలాపురంలో 'చెడి తాలింఖానా' ఉత్సవం.. ప్రత్యేకతలు ఇవే!

Chedi Talimkhana Celebrations: విజయదశమి సందర్భంగా అమలాపురంలో 'చెడి తాలింఖానా' ఉత్సవం.. ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2024
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా సందర్భంగా కొన్ని ప్రాంతంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించే చెడీ తాలింఖానా ఉత్సవాలు ఈ విషయంలో మినహాయింపు కాదు. ఈ ఉత్సవాలు విజయదశమి సందర్భంగా ఆయుధ ప్రదర్శనలతో పాటు ఊరేగింపుల రూపంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 1835లో అమలాపురం కొంకాపల్లి వీధిలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, 189 సంవత్సరాలుగా కొనసాగుతుండటం విశేషం. ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగే చెడీ తాలింఖానా వేడుకలు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఏడు వీధుల ఊరేగింపుల ద్వారా కొనసాగనున్నాయి. కర్ర సాము, కత్తి సాము వంటి 60 రకాల యుద్ధ విన్యాసాలతో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

Details

 గురువు అబ్బిరెడ్డి మల్లేష్‌ ఆధ్వర్యంలో  ప్రదర్శనలు

ఈ సందర్భంగా అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనాల మినహా ఇతర వాహనాలకు ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అమలాపురం మహిపాలవీధిలోని శ్రీఅబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 189వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శనను బుధవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు, కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలు ఆకర్షణీయంగా జరిగాయి. చెడీ తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్‌ ఆధ్వర్యంలో నాలుగో తరానికి చెందిన వీరవిద్యను ఈరోజు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

Details

సమరయోధుల ఐక్యతకు ప్రతీకగా ఉత్సవాలు

బ్రిటిష్‌ కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా స్థాపించారు. సమరయోధుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ విద్య, కోనసీమ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ప్రతేడాది దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వస్తున్నాయి.