Indoor Air clean plants: స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం.. ఈ మొక్కలతో సాధ్యమే!
ఈ వార్తాకథనం ఏంటి
మనమంతా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం గురించి తరచూ మాట్లాడుకుంటాం.
కానీ ఇంట్లో ఉండే కాలుష్యం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? వంట నూనెల నుంచి ఫ్లోర్ క్లీనర్ల వరకు ఎన్నో రసాయనాలు గృహంలోని గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.
ఈ సమస్యను తగ్గించడానికి ఇంట్లో కొన్ని మొక్కలను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
Details
ఇంట్లో పెంచదగిన మొక్కలివే!
1. ఆంగ్లోనెమా
ఈ మొక్క ఆకర్షణీయమైన ఆకులతో 15 రకాల రంగుల్లో లభిస్తుంది. ఇది గాలిలోని విషపూరిత వాయువులను పీల్చుకుని శుద్ధి చేస్తుంది. దోమలను నివారించడంలో కూడా సాయపడుతుంది.
అయితే దీన్ని నేరుగా సూర్యరశ్మి తగిలే చోట కాకుండా, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడాలి.
2. పెపరోమియా
'రేడియేటర్ ప్లాంట్'గా పేరొందిన ఈ మొక్క అధిక ఉష్ణోగ్రతలను గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది. చిన్న ఆకులతో గుబురుగా పెరిగే ఈ మొక్క బెడ్‌రూమ్, లివింగ్‌రూమ్, బాల్కనీ, వాష్‌రూమ్‌లో పెట్టుకోవచ్చు.
గాలిలోని నీటి బిందువులను గ్రహించడంతో తక్కువ నీరు సరిపోతుంది. వీటి మందమైన ఆకులు గాలిని బాగా శుద్ధి చేస్తాయి.
Details
3. ఇంగ్లిష్ ఐవీ
ఇది వేగంగా పెరిగే మొక్కలలో ఒకటి. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్‌గాను పనిచేస్తుంది. దీనికి అధిక నీరు అవసరం లేదు. మట్టి పొడిగా మారినప్పుడు మాత్రమే నీరు అందించాలి.
కిటికీల నుంచి వచ్చే వెలుతురులోనే చక్కగా పెరుగుతుంది. దీనికి రసాయన ఎరువులు వాడకూడదు, పూర్తిగా సేంద్రీయ ఎరువులనే ఉపయోగించాలి.
4. ఆంథూరియం
ఈ మొక్కను 'ఫ్లెమింగో ఫ్లవర్' అని కూడా పిలుస్తారు. దాదాపు 800 రకాల జాతులు ఉన్నాయి. దీని ఆకులు, పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
తక్కువ వెలుతురులో బాగా పెరుగుతుంది. చలికాలంలో ఇది పూర్తిగా సుషుప్తావస్థలోకి వెళ్తుంది, వేసవిలో మళ్లీ పెరుగుతుంది.
Details
5. డ్రాకేనా
'సాంగ్ ఆఫ్ ఇండియా'గా పిలిచే ఈ మొక్క గాలి శుద్ధి చేసే ముఖ్యమైన మొక్కలలో ఒకటి. ఇది వివిధ రంగులలో లభిస్తుంది. కాండాన్ని కత్తిరించి నాటినా 15 రోజుల్లో కొత్తగా పెరుగుతుంది.
దీని పెరుగుదలకు ఎక్కువ నీరు అవసరం లేదు. ఎలాంటి వెలుతురు పరిస్థితుల్లోనైనా పెరుగుతుంది.
6. బ్లాక్ జీజీ
ఈ మొక్క మొదట ఆకుపచ్చగా ఉండి, క్రమంగా నల్లగా మారుతుంది.
ఆకులు నీటిని నిల్వ చేసుకునే శక్తి కలిగి ఉంటాయి. తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది. గాలిని అత్యంత సమర్థంగా శుద్ధి చేస్తుంది.
Details
7. స్నేక్ ప్లాంట్
ఇది 'మదర్ ఇన్ లా టంగ్' అనే పేరుతో కూడా ప్రసిద్ధి పొందింది. దీని పొడవైన, పదునైన ఆకులు పామును పోలి ఉంటాయి. ప్రత్యేకంగా, రాత్రి సమయంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.
ఎక్కువ రసాయనాలున్న ప్రదేశాల్లో వీటిని విరివిగా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది. కానీ నీటిని అధికంగా అందిస్తే వేర్లు బలహీనమై చనిపోతాయి.
Details
ఈ మొక్కల వల్ల కలిగే లాభాలు
గాలిలోని హానికర రసాయనాలను, కాలుష్య కారకాలను తొలగిస్తాయి.
ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ల కంటే ఇవి మెరుగ్గా పనిచేస్తాయని నాసా నిర్థారించింది.
ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు అందంగా కూడా మారుస్తాయి.
పెంచడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. చిన్న కుండీల్లో పెంచి ఇంటిని ఆకుపచ్చగా మార్చుకోవచ్చు.
ప్రముఖ నర్సరీలతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఈ మొక్కలు లభిస్తున్నాయి.
ఇవి పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరడంతో పాటు ఇంటికి అందాన్ని, చక్కటి వాతావరణాన్ని అందిస్తాయి!