LOADING...
Lifestyle Changes: ఆరోగ్యకర అలవాట్లతో 9 ఏళ్లకు పైగా అదనపు జీవితకాలం : అధ్యయనం 
ఆరోగ్యకర అలవాట్లతో 9 ఏళ్లకు పైగా అదనపు జీవితకాలం : అధ్యయనం

Lifestyle Changes: ఆరోగ్యకర అలవాట్లతో 9 ఏళ్లకు పైగా అదనపు జీవితకాలం : అధ్యయనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన రోజువారీ జీవనంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే ఆయుష్షుపై పెద్ద ప్రభావం చూపుతాయని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. ప్రతిరోజూ ఐదు నిమిషాలు ఎక్కువగా నిద్రపోవడం, రెండు నిమిషాల పాటు మెట్లు ఎక్కడం లేదా వేగంగా నడవడం వంటి సులభమైన మార్పులు చేస్తే జీవితకాలానికి ఒక సంవత్సరం వరకు అదనంగా చేరుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా ఆరోగ్యకరంగా లేని జీవన విధానం అలవాటైన వారికి ఇవి మరింత లాభాన్ని ఇస్తాయని తెలిపారు. ప్రఖ్యాత వైద్య జర్నల్‌ "ది లాన్సెట్ ఈ-క్లినికల్ మెడిసిన్"లో బుధవారం ప్రచురితమైన ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 60 వేల మందిని ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు.

వివరాలు 

40 నిమిషాలకుపైగా వ్యాయామం

రోజువారీ ఆహారంలో అర కప్పు కూరగాయలను అదనంగా చేర్చుకుంటే కూడా ఇలాంటి ప్రయోజనమే ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. ఇక రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర, కనీసం 40 నిమిషాలకుపైగా వ్యాయామం, సమతుల్యమైన ఆరోగ్యకరమైన ఆహారం వంటి ఉత్తమ అలవాట్లు పాటిస్తే ఆయుష్షు తొమ్మిది సంవత్సరాలకు పైగా పెరిగే అవకాశం ఉందని, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని అధ్యయనం స్పష్టం చేసింది. నిద్ర, వ్యాయామం, ఆహారం అనే మూడు అంశాల్లో ఒకేసారి మెరుగుదల సాధిస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వివరించారు. ఉదాహరణకు, ఆయుష్షు ఒక సంవత్సరం పెరగాలంటే కేవలం నిద్రపైనే ఆధారపడితే రోజుకు 25 నిమిషాలు అదనంగా నిద్ర అవసరం అవుతుంది.

వివరాలు 

ఐదు నిమిషాలు ఎక్కువగా నడిస్తే..

అదే సమయంలో ఆహారం, వ్యాయామంలో కూడా చిన్న మార్పులు చేసుకుంటే, రోజుకు కేవలం ఐదు నిమిషాల అదనపు నిద్రతోనే అదే ప్రయోజనం పొందవచ్చని వారు తెలిపారు. ఇదే తరహాలో "ది లాన్సెట్" జర్నల్‌లోనే ప్రచురితమైన మరో పరిశోధన శారీరక శ్రమ ఎంత కీలకమో మరోసారి రుజువు చేసింది. ప్రతిరోజూ ఐదు నిమిషాలు ఎక్కువగా నడిస్తే మరణాల ప్రమాదం 10 శాతం వరకు తగ్గుతుందని ఆ అధ్యయనం పేర్కొంది. అలాగే రోజూ కూర్చునే సమయాన్ని అరగంట తగ్గిస్తే మొత్తం మరణాల ముప్పు సుమారు 7 శాతం మేర తగ్గుతుందని అంచనా వేశారు. అయితే ఈ ఫలితాలను వ్యక్తిగత వైద్య సలహాలుగా కాకుండా, సమాజం మొత్తానికి కలిగే ప్రయోజనాల దృష్టితో చూడాలని పరిశోధకులు స్పష్టం చేశారు.

Advertisement