Constitution Day 2026: రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. చాలామందికి జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం గుర్తొస్తుంది. కానీ మన దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నవంబర్ 26. 1949లో ఇదే రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. దాదాపు మూడేళ్లపాటు జరిగిన చర్చలు, సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకే నవంబర్ 26కు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.
Details
అంబేడ్కర్ సేవలకు గుర్తుగా..
భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించారు.
ఆయన నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించింది.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులుగా రాజ్యాంగం నిలిపింది.
అంబేడ్కర్ సహా రాజ్యాంగ నిర్మాతల కృషిని గుర్తుచేసుకోవడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశం.
2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను అధికారికంగా రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అంతకుముందు ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా పాటించేవారు.
Details
రాజ్యాంగం ఆమోదం ఒక రోజు.. అమలు మరో రోజు
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించినప్పటికీ, అది వెంటనే అమల్లోకి రాలేదు.
1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదే రోజు భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది.
1930లో జరిగిన పూర్ణ స్వరాజ్య ప్రకటనకు గుర్తుగా జనవరి 26ను ఎంచుకున్నారు. అందుకే నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా, జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా వేర్వేరు సందర్భాలను గుర్తుచేస్తాయి.
Details
2026లో ప్రత్యేక కార్యక్రమాలు
2026 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి "The Constitution @76: Dr. B.R. Ambedkar's Constitutional Vision and the Future of Indian Democracy" అనే థీమ్‌ను నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పీఠిక పఠనం, క్విజ్‌లు, చర్చలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు మాత్రమే కాకుండా, పౌరులుగా మన బాధ్యతలను కూడా గుర్తుచేసే రోజుగా నవంబర్ 26 నిలుస్తోంది.