Summer Indoor Plants: వేసవికాలంలో మీ ఇంటిని చల్లగా ఉంచేందుకు ఈ ఇండోర్ ప్లాంట్స్ ను పెంచుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోర్ ప్లాంట్స్ అంటే సూర్యకాంతి ఎక్కువగా రానిఇళ్లలో, ఆఫీసుల్లో లేదా ఇతర లోపలి ప్రదేశాలలో పెంచే మొక్కలు.
ఇవి గది అందాన్ని పెంచటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ చల్లదనాన్ని కూడా ఇచ్చేలా పనిచేస్తాయి.
సాధారణంగా, ఈ మొక్కలు తక్కువ కాంతిలో జీవించగల సామర్థ్యంతో ఉండటంతో పాటు, గాలిని స్వచ్ఛం చేసే గుణాలను కలిగి ఉంటాయి.
ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి ఇంట్లోని ఉష్ణోగ్రతను తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరిచేలా సహాయపడతాయి.
వివరాలు
ఇండోర్ మొక్కల ద్వారా పొందే ప్రయోజనాలు
1. ఇంటిలో సహజ చల్లదనం
ఇండోర్ మొక్కలు భాష్పోత్సర్గం (transpiration) ప్రక్రియ ద్వారా గాలిలో తేమను పెంచుతాయి.దీంతో గది ఉష్ణోగ్రత తగ్గుతుంది. అరేకా పామ్,పీస్ లిల్లీ వంటి పెద్ద ఆకుల మొక్కలు గదిని సహజంగా చల్లబరచడంలో సహాయపడతాయి.
2. గాలి నాణ్యత మెరుగుపరుస్తాయి
ఇండోర్ ప్లాంట్స్ గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి విష పదార్థాలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. స్పైడర్ ప్లాంట్,స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలు గాలిని స్వచ్ఛంగా ఉంచేందుకు సహాయపడతాయి.
3. తేమ పెంచి పొడిబారిన వాతావరణాన్ని తగ్గిస్తాయి
ఎండాకాలంలో గాలి పొడిగా మారడం వల్ల చర్మం పొడిబారడం,శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశముంది. బోస్టన్ ఫెర్న్,అరేకా పామ్ వంటి మొక్కలు గాలిలో తేమను పెంచుతూ,అనుకూల వాతావరణాన్ని అందిస్తాయి.
వివరాలు
4. ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
పచ్చదనంతో కూడిన వాతావరణం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఇంట్లో మొక్కలు పెంచడం ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మన శ్రేయస్సును మెరుగుపరిచేలా పనిచేస్తుంది. పరిశోధనల ప్రకారం, ఇండోర్ మొక్కలు ప్రొడక్టివిటీని పెంచేలా కూడా ప్రభావితం చేస్తాయని తేలింది.
5. సహజ కీటక నివారణ
తులసి, లావెండర్, సిట్రోనెల్లా వంటి కొన్ని మొక్కలు దోమలు, ఇతర హానికర కీటకాలను దూరం చేసేందుకు సహాయపడతాయి.
6. ఇంటికి అందం, ఆకర్షణ
ఇండోర్ మొక్కలు ఇంటి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చే గుణాన్ని కలిగి ఉంటాయి. వేలాడే మొక్కలు, నిటారుగా పెరిగే మొక్కలు ఇంట్లో సహజ సౌందర్యాన్ని తీసుకొస్తాయి.
వివరాలు
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచే బెస్ట్ ఇండోర్ మొక్కలు
స్నేక్ ప్లాంట్ (సాన్సెవిరియా) - తక్కువ కాంతిలో బతికగలదు, గాలిని స్వచ్ఛంగా ఉంచుతుంది. తక్కువ నీరు సరిపోతుంది.
అరేకా పామ్ - గదిలో తేమను సమతుల్యం చేస్తుంది, ఇంట్లో తేలికపాటి చల్లదనాన్ని అందిస్తుంది.
స్పైడర్ ప్లాంట్ (జేడ్ ప్లాంట్) - గాలిలోని విష పదార్థాలను తొలగిస్తుంది, పరోక్ష కాంతిలో కూడా బాగా పెరుగుతుంది.
పీస్ లిల్లీ - తక్కువ నీరు, తక్కువ వెలుతురులో బతికే మొక్క. గాలిని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది.
మనీ ప్లాంట్ - తక్కువ నిర్వహణ అవసరం, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విభిన్న కాంతి పరిస్థితుల్లోనూ బతుకుతుంది.
రబ్బర్ ప్లాంట్ - గాలిలోని హానికర రసాయనాలను తొలగిస్తుంది, తక్కువ నిర్వహణతో బతికే మొక్క.
వివరాలు
సహజంగా చల్లబరచేందుకు ఈ మొక్కలు పెంచవచ్చు
ఇండోర్ ప్లాంట్స్ వాతావరణాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, గాలి నాణ్యతను మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గించి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.
సరైన కాంతి, నీరు, తేమ వంటి చిన్నసామాన్యమైన జాగ్రత్తలతో ఈ మొక్కలను సులభంగా పెంచుకోవచ్చు.
ఈ వేసవిలో మీ ఇంటిని సహజంగా చల్లబరచేందుకు ఈ మొక్కలను పెంచడం అలవాటు చేసుకోండి!