LOADING...
Father: నాన్న.. మనకు అండ, కానీ ఎందుకో నచ్చడెందుకో!
నాన్న.. మనకు అండ, కానీ ఎందుకో నచ్చడెందుకో!

Father: నాన్న.. మనకు అండ, కానీ ఎందుకో నచ్చడెందుకో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాన్న అంటే—నడిపించే దారి, నిలబెట్టే బలం. మనం పారిపోతాం, తడబడతాం, పరిగెడతాం, పడిపోతాం, మళ్లీ లేస్తాం, చివరికి ఎదుగుతాం. ఈ ప్రయాణంలో ప్రతి విజయానికి వెనక నాన్న శ్రమే ఉంటుంది. మనం ఆనందిస్తే ఆయన నిశ్శబ్దంగా కేరింతలు కొడతాడు. ఏం చదవాలో, ఎలా నడవాలో, ఎలాంటి అడుగులు వేయాలో మనకన్నా ముందే ఆలోచిస్తాడు. మన అడుగుల కింద ఎప్పుడూ ఆయన చేయి ఉంటుంది కాబట్టి ధైర్యంగా నడవొచ్చు. తప్పు చేస్తే కాస్తాడు, తప్పటడుగు వేస్తే పట్టుకుంటాడు. అయినా ఎందుకో చాలామందికి నాన్న నచ్చడమే కష్టం! ఇలా చేయి, అలా చేయకు, ఇది తిను, అదికట్టు అంటూ నిత్యం గదమాడతాడన్నది కొందరి ఫిర్యాదు.

Details

తనకన్నా మెరుగైన జీవితం ఇవ్వడమే లక్ష్యం

కానీ అంతకంటే గొప్ప లైఫ్ కోచ్ ఇంకెవరు ఉంటారు? అర్థం చేసుకోలేని వారికి నాన్న జోక్యం పెడుతున్నట్టే కనిపిస్తుంది. ఏం తినాలో తెలియదా? ఎక్కడికి వెళ్లాలో చెప్పాలా? నాన్న పెద్ద తలనొప్పి అని గొణుక్కుంటారు. అయినా ఆయన పట్టించుకోడు. ఎందుకంటే అమ్మకు పిల్లలు బాగుంటే సరిపోతుంది. కానీ నాన్నకు అలాకాదు—తన పిల్లలు అందరిలో గౌరవంగా నిలబడాలని, తనకన్నా మెరుగైన జీవితం గడపాలని, ఇతరులకు అండగా నిలవాలని ఆశిస్తాడు. నాన్న ప్రమాణాలు పెద్దవే, కానీ అవన్నీ మన బాగుకోసమే. అయినా ఎందుకో నాన్న నచ్చడమే కష్టం!

Details

నాన్న ఉంటే కష్టాలు కొండలా కరిగిపోతాయి

నాన్న చేతి వేలుపట్టి నడిపిస్తే, ఆ దారిలోనే ప్రపంచం పరిచయం అవుతుంది. గుర్తుందా చిన్నప్పుడు? గుడి ఊరేగింపులో దేవుడిని చూపించడానికి భుజంపైకి ఎత్తుకుని చూపించేవాడు. నిజానికి అప్పుడే మనం దేవుడి మీద కూర్చుని దేవుణ్ని చూశామన్న విషయం అర్థం కాలేదు. ఇప్పటికీ గ్రహించకపోతే అంతకన్నా దురదృష్టం లేదు. మీరు ఎంత ఎదిగినా కష్టాలు వస్తాయి. అలాంటప్పుడు నాన్నను గుర్తు చేసుకోండి. ఎక్కడున్నా ధైర్యం ఇస్తాడు. చదువుల్లో వెనకబడినా, కుటుంబంలో విభేదాలొచ్చినా, డబ్బు లేకపోయినా, అప్పులు ముంచినా, ఆస్తి పంచాయితీలు పెట్టినా—నాన్న అండగా ఉంటే చాలు, కష్టాలు కొండల్లా కరిగిపోతాయి.

Details

నాన్న పవర్ హౌస్ లాంటివాడు

తెరపై మాత్రమే వెలిగే హీరోల కోసం కటౌట్లకూ పాలాభిషేకాలు చేసే మూర్ఖత్వం ఎందుకు? నిజమైన హీరో మనింట్లోనే ఉన్నాడు కదా! జీవితనౌకకు దారిచూపే లైట్ హౌస్‌లా నాన్న ఎప్పుడూ మన చుట్టూనే తిరుగుతుంటాడు. ఆయనే మన నిజమైన హీరో. ఎందుకంటే, మనకోసం ఎత్తులకు ఎక్కుతాడు, లోతులకు దిగుతాడు, ఏదైనా చేసి పెడతాడు. నిజంగా చూడగలిగితే నాన్ననే పవర్ హౌస్‌. ఆయన అడుగుజాడల్లో నడిస్తే చదువు, ఉద్యోగం, కెరీర్ మాత్రమే కాదు—ప్రపంచాన్నే గెలవొచ్చు. నమ్మండి, నాన్నకన్నా గొప్ప స్ఫూర్తి పాఠం ఎక్కడా దొరకదు.