Navjot Singh Sidhu: పసుపు,వేపాకు,నిమ్మరసంతో.. స్టేజ్-4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య..
మాజీ క్రికెటర్,రాజకీయ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ స్టేజ్-4 క్యాన్సర్‌పై విజయవంతంగా పోరాడి విజయం సాధించారు. వైద్యులు బతికే అవకాశం కేవలం 3 శాతం మాత్రమే ఉందని చెప్పినప్పటికీ,ఆమె ధైర్యంతో క్యాన్సర్‌ని అధిగమించారు. ఈ విషయాన్ని నవజ్యోత్ కౌర్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె ఒక సంవత్సరం పాటు క్యాన్సర్‌తో నిరంతరం పోరాడారు.స్టేజ్-3 ట్రీట్మెంట్ సమయంలో, వైద్యులు చిన్న ఆశ మాత్రమే చూపించగలిగారు. "మా కుమారుడి పెళ్లి తర్వాత ఆమెకు క్యాన్సర్ తిరిగి వచ్చింది.ఆమె బతుకుతుందా లేదా అనే అనుమానం మా మనసులో ఉండేది. కానీ ఆమె ఎన్నడూ నమ్మకం కోల్పోలేదు.ధైర్యంగా క్యాన్సర్‌ను ఎదుర్కొంది," అని సిద్ధూ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
సమర్థవంతమైన చికిత్స
నవజ్యోత్ కౌర్ పాటియాలలోని ప్రభుత్వ రాజేంద్ర మెడికల్ కాలేజీలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా సిద్ధూ ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా మంచి చికిత్స పొందవచ్చని ప్రస్తావించారు. "మేము డబ్బు వల్ల కాకుండా, ఆమె క్రమశిక్షణ, కఠినమైన జీవనశైలి, సరైన ఆహార నియమాలను అనుసరించడంవల్ల క్యాన్సర్‌ని జయించగలిగారు," అని పేర్కొన్నారు.
ఆహార పద్ధతులు ఆమెను రక్షించాయి
ఆయుర్వేద పద్ధతులు, ప్రత్యేకమైన ఆహార నియమాలు నవజ్యోత్ కౌర్‌కు కీలకంగా మారాయి. నిమ్మరసం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేప ఆకులు, తులసి వంటి ఆహార పదార్థాలను ఆమె నియమితంగా తీసుకున్నారు. అలాగే, గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌తో తయారు చేసిన జ్యూస్‌లను కూడా ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆమె ఆహారంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్న పదార్థాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వంటలకు కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనె మాత్రమే ఉపయోగించారని, ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు, బెల్లం, యాలకులు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రేరణాత్మక విజయగాధ
నవజ్యోత్ కౌర్ సిద్ధూ ధైర్యం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా క్యాన్సర్‌ను జయించడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని ఈ గాధ మరోసారి రుజువు చేసింది.