LOADING...
Chinnamasta Devi : రాజమౌళి 'వారణాసి' సినిమాలో ఛిన్నమస్తా దేవి రూపం.. ఆ రూపం వెనుక దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు
ఆ రూపం వెనుక దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు

Chinnamasta Devi : రాజమౌళి 'వారణాసి' సినిమాలో ఛిన్నమస్తా దేవి రూపం.. ఆ రూపం వెనుక దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజమౌళి - మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో విడుదల చేసిన గ్లింప్స్‌తో సినిమా మీద భారీ హంగామా మొదలైంది. అయితే ఆ గ్లింప్స్‌లో కనిపించే సముద్రగర్భంలోని ఛిన్నమస్తాదేవి రూపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె మొండెం నుంచి మూడు రక్తధారలు బయటకు వస్తుండగా, వాటిలో రెండు ఆమె సేవకురాళ్లైన డాకినీ, వార్షిణి నోటికి చేరతాయి. మూడో ధారను ఆమె తానే సేవిస్తుంది. రూపం ఎంత భయంకరంగా ఉన్నా... లోపల మాత్రం గాఢమైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఛిన్నమస్తాదేవి అవతారం వెనుక అనేక కథలు ఉన్నట్టు శాస్త్రాలు చెబుతాయి.

వివరాలు 

 ఆకలి తీర్చేందుకు.. 

నారదపంచరాత్రంలో ఛిన్నమస్తాదేవి జన్మకథను విపులంగా వివరించారు. కథ ప్రకారం—పార్వతీదేవి ఒకసారి మందాకినీ నదిలో స్నానం చేస్తుండగా లైంగిక ఉత్తేజం కలిగిన కారణంగా ఆమె శరీరం నల్లగా మారుతుంది. అప్పుడు ఆమెతో పాటు ఉండే సేవకురాళ్లు డాకినీ, వార్ణిణి వచ్చి ఆకలితో అలమటిస్తూ ఆహారం అడుగుతారు. అన్నపూర్ణాదేవి స్వరూపమైన పార్వతీ చుట్టుపక్కల ఏమి దొరకకపోవడంతో, ఆకలి తీర్చేందుకు తన తలను ఖండించుకుంటుంది. ఆమె మొండెం నుంచి వచ్చే మూడు రుధిరదారల్లో రెండింటిని డాకినీ, వార్షిణిలకు అందిస్తే... మూడోది తానే గ్రహిస్తుంది. తద్వారా వారి ఆకలి తీరుస్తుంది. ఛిన్నమస్తా ఉపాసన ఆత్మజ్ఞానం, మానసిక బంధనాల నుంచి విముక్తి, శత్రుశక్తుల నుంచి రక్షణ ఇస్తుందని విశ్వసిస్తారు.

వివరాలు 

ఛిన్నమస్తాదేవిని మానవ జీవన పయనంలోని మూడు ప్రధాన దశలు

మరో కథనం ప్రకారం.. లైంగిక ఉత్తేజం పెరిగినపుడు దానిపై నియంత్రణ కోసం రతీ-మన్మథుల దేహాలపై నగ్నంగా నిలబడిన ఛిన్నమస్తాదేవి, శరీరంపై పూర్తి అధికారాన్ని కలుపుకుని మనస్సును దేహం నుండి వేరు చేయడానికి స్వీయ శిరఛ్ఛేదం చేస్తుంది. దాంతో ఆమె కామవ్యగ్రతను జయించి స్వీయ నియంత్రణ సాధించినట్టు భావిస్తారు. అందుకే తాంత్రిక సంప్రదాయాల్లో దీక్షలు, ఉపాసనలు చేసే వారు ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఇక ఛిన్నమస్తాదేవిని మానవ జీవన పయనంలోని మూడు ప్రధాన దశలు.. జననం, రతి, మరణం—అనే మూడు రూపాల్లో దర్శిస్తారని కూడా చెబుతారు. గృహస్తులు, కుటుంబ బాధ్యతలు ఉన్నవారు, సాత్విక దేవతలతో పాటు ఆమెను ఇంట్లో పూజించడం సాధారణంగా చేయరు. ఎందుకంటే ఆమె ఆరాధన క్లిష్టమైన తాంత్రిక విధానాలపై ఆధారపడి ఉంటుంది.

వివరాలు 

దశమహావిద్యల్లో ఈ దేవతకు ప్రత్యేక స్థానం

గట్టి నియమాలు, నిరంతర నియంత్రణ ఉన్న ఉపాసకులే ఆమెను సిద్ధి కోసం పూజిస్తారు. తాంత్రిక సాధనలో ఛిన్నమస్తాదేవి అత్యంత ప్రధాన దేవతల్లో ఒకరిగా గుర్తించబడుతుంది. సర్వశక్తి ప్రసాదించే శక్తిరూపిణిగా కూడా ఆమెను వర్ణిస్తారు. 'ఛిన్న' అంటే కోసిన లేదా ఖండించిన, 'మస్తా' అంటే తల. అందుకే ఆమెను ఛిన్నమస్తాదేవి అంటారు. దశమహావిద్యల్లో ప్రత్యేక స్థానం కలిగిన ఈ దేవికి వజ్ర వైరోచనీ, ప్రచండచండీ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తర భారతంలో, ముఖ్యంగా హిమాచల్ ప్రాంతంలో, ఆమెను చింతపుర్ణీ దేవిగా ఘనంగా ఆరాధిస్తారు.