LOADING...
Offer Letter Vs Appointment Letter : ఆఫర్ లెటర్,అపాయింట్‌మెంట్ లెటర్ మధ్య తేడా ఏమిటి?
ఆఫర్ లెటర్,అపాయింట్‌మెంట్ లెటర్ మధ్య తేడా ఏమిటి?

Offer Letter Vs Appointment Letter : ఆఫర్ లెటర్,అపాయింట్‌మెంట్ లెటర్ మధ్య తేడా ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. అదే విధంగా, ఉద్యోగ నియామకం కూడా ప్రతి సంస్థ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. సంస్థలు తమకు అవసరమైన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలనుకుంటాయి. అలాగే అభ్యర్థులు తమ ప్రతిభకు తగిన స్థాయిలో మంచి కంపెనీలో ఉద్యోగం పొందాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక అభ్యర్థిని సంస్థ ఉద్యోగానికి ఎంపిక చేసిన తర్వాత మొదటగా ఆఫర్ లెటర్ జారీ చేస్తుంది. అభ్యర్థి ఆ ఆఫర్‌ను అంగీకరించి, ఉద్యోగంలో చేరిన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ అందుతుంది. ఈ రెండు మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

ఆఫర్ లెటర్ అంటే ఏమిటి? 

ఒక అభ్యర్థి రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన తర్వాత, అతనికి ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం, టైమింగ్స్, వేతన వివరాలు, హోదా,బాధ్యతలు,ప్రయోజనాలు వంటి వివరాలతో కూడిన లేఖను సంస్థ జారీ చేస్తుంది. దీనినే ఆఫర్ లెటర్ అంటారు. ఇది ఉద్యోగంలో చేరేందుకు అభ్యర్థికి ఇచ్చే తొలి పత్రం. ఆఫర్ లెటర్ ముఖ్యాంశాలు: సమయం: ఎంపిక ప్రక్రియ ముగిసిన వెంటనే సంస్థ అభ్యర్థికి ఆఫర్ లెటర్ ఇస్తుంది. ఇది ఉద్యోగంలో చేరే ప్రక్రియకు ప్రారంభం చూపిస్తుంది. ఉద్దేశం: అభ్యర్థిని సంస్థలో చేరమని అధికారికంగా ఆహ్వానించడం. ఉద్యోగానికి ఎంపికైనట్లు ధృవీకరించడం. ఉద్యోగానికి సంబంధించిన కీలక సమాచారం అందించడమే లక్ష్యం. నిడివి: సాధారణంగా ఒక పేజీలోపు ఉండే ఈ పత్రంలో సమాచారం సంక్షిప్తంగా ఉంటుంది.

వివరాలు 

ఆఫర్ లెటర్‌

ప్రధాన సమాచారం: వేతనం: వార్షిక ప్యాకేజీ వివరాలు. చేరిక తేదీ: ఎప్పటి వరకు ఉద్యోగంలో చేరవచ్చో స్పష్టత. గడువు తేదీ: ఆఫర్ చెల్లుబాటు అయ్యే తుది తేదీ. హోదా: ఉద్యోగ హోదా, బాధ్యతలు. ప్రదేశం: ఉద్యోగం చేయాల్సిన లొకేషన్ వివరాలు. షరతులు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ వంటి తదుపరి ప్రక్రియల సమాచారం. అభ్యర్థి చేయాల్సినవి: ఆఫర్ లెటర్‌ను చదివి అంగీకరిస్తే సంతకం చేసి తిరిగి హెచ్‌ఆర్‌కు పంపాలి.

వివరాలు 

అపాయింట్‌మెంట్ లెటర్ అంటే ఏమిటి? 

ఆఫర్ లెటర్‌కు అభ్యర్థి అంగీకారం తెలిపి, ఉద్యోగంలో చేరిన తర్వాత జారీ చేసే అధికారిక, చట్టబద్ధమైన పత్రమే అపాయింట్‌మెంట్ లెటర్. ఇది సంస్థ, ఉద్యోగి మధ్య జరిగే ఒప్పందాన్ని ప్రతిబింబిస్తుంది. ఇందులో ఉద్యోగానికి సంబంధించిన ప్రతీ ముఖ్యమైన అంశం వివరంగా పొందుపరచబడుతుంది. అపాయింట్‌మెంట్ లెటర్ ముఖ్యాంశాలు: సమయం: ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లెటర్ జారీ అవుతుంది. అభ్యర్థి చేరికను అధికారికంగా ధృవీకరించే పత్రంగా పని చేస్తుంది. ఉద్దేశం: ఉద్యోగానికి సంబంధించిన నియమ నిబంధనల స్పష్టీకరణ. ఇది ఉద్యోగి, సంస్థ మధ్య జరిగే కాంట్రాక్టుగా ఉపయోగపడుతుంది. నిడివి: దీని సమాచారం సుమారు 3 నుంచి 4 పేజీల వరకు విస్తరించి ఉంటుంది.

వివరాలు 

అపాయింట్‌మెంట్ లెటర్

ప్రధాన సమాచారం: వేతనం: ఖచ్చితమైన వివరాలతో శాలరీ బ్రేక్అప్, బోనస్‌లు, భత్యాలు. సీటీసీ: వార్షికంగా సంస్థ ఖర్చు చేసే మొత్తం వివరాలు. ప్రొబేషన్ పీరియడ్: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ప్రొబేషనరీ పీరియడ్‌ను కేటాయిస్తాయి. నిర్దిష్టంగా కొంతకాలం పాటు ప్రొబేషన్‌లో ఉండాలని సూచిస్తాయి. ఆ వ్యవధిలో ఉద్యోగి పనితీరుపై మదింపు ఎలా జరుగుతుందనేది తెలియజేస్తాయి. నోటీస్ పీరియడ్: రాజీనామా చేసే ముందు ఇవ్వాల్సిన గడువు. ఉద్వాసన షరతులు: ఉద్యోగ సంబంధం ఎప్పుడు, ఎలా ముగించవచ్చన్న వివరణ. సెలవులు: ప్రతి సంవత్సరం లేదా నెలలో లభించే సెలవుల వివరాలు. చట్టబద్ధమైన ప్రయోజనాలు: పీఎఫ్, గ్రాట్యుటీ వంటి లాభాలు.

వివరాలు 

అపాయింట్‌మెంట్ లెటర్

కంపెనీ పాలసీలు: సంస్థ విధానాలు, నిబంధనలు, ప్రవర్తనా నియమాలు. ఉద్యోగి చేయాల్సినవి: లెటర్‌ను పూర్తిగా చదివి, అందులోని షరతులపై అంగీకారం తెలిపి సంతకం చేయాలి.