Diapers Damage Babies Kidneys : డైపర్లు పిల్లల కిడ్నీలకు హాని చేస్తాయా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే
ఈ వార్తాకథనం ఏంటి
కొంతమంది తల్లిదండ్రుల్లో డైపర్ వాడకంపై అనుమానాలు ఉన్నాయి. పిల్లలకు డైపర్లు వేస్తే కిడ్నీలు దెబ్బతింటాయన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. అయితే శిశువైద్య నిపుణుల ప్రకారం ఈ భావన పూర్తిగా తప్పు. డైపర్ పని కేవలం బిడ్డ విసర్జించిన మూత్రం, మలాన్ని శోషించి బయటకు రానివ్వకుండా సంరక్షించడం మాత్రమే. కిడ్నీలు శరీరంలోపల రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు. డైపర్ మరియు కిడ్నీకి నేరుగా ఎలాంటి సంబంధం లేదు. అందువల్ల డైపర్ వాడటం వల్ల కిడ్నీలకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం వైద్యపరంగా ఆధారంలేనిది. అయితే, డైపర్‌ను ఎక్కువసేపు మార్చకుండా ఉంచితే బిడ్డ చర్మంపై దద్దుర్లు, దురద, ఎర్రదనం లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
వివరాలు
డాక్టర్ల సలహాలు:
తడి డైపర్‌లో బ్యాక్టీరియా పెరిగి, అది మూత్ర మార్గంలోకి చేరితే కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)కు దారితీయవచ్చు. అయినప్పటికీ ఈ సమస్యలు చాలా సందర్భాల్లో సులభంగా నయం చేస్తారు. ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవు. అందుకే డైపర్‌ను సమయానికి మార్చడం అత్యవసరం. డైపర్ తడిగా కనిపించకపోయినా మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి మార్చాలి. బిడ్డ మలం చేసిన వెంటనే డైపర్‌ను తప్పనిసరిగా మార్చాలి. డైపర్ మార్చిన తర్వాత బిడ్డ చర్మాన్ని బేబీ వైప్స్ లేదా గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత చర్మాన్ని కొద్దిసేపు గాలి తగలడం కోసం విడిచిపెట్టాలి. అవసరమైతే బేబీ క్రీమ్ లేదా రాష్ క్రీమ్ని తేలికగా రాయవచ్చు.
వివరాలు
చర్మం గాలి పీల్చుకోవడానికి వీలు
పిల్లలు నిద్రపోతున్న సమయంలో తాజా, శుభ్రమైన డైపర్ వేయడం ముఖ్యం. రాత్రిపూట తడి డైపర్ చర్మాన్ని ఇబ్బందిపెట్టడమే కాకుండా నిద్రకూ భంగం కలిగిస్తుంది. అందువల్ల శుభ్రమైన డైపర్ బిడ్డకు ప్రశాంతమైన నిద్రనిస్తుంది. పగటిపూట కొంతసేపు డైపర్ లేకుండా ఉంచడం మంచిది. ఇది చర్మం గాలి పీల్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. దద్దుర్లు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో కాటన్ బట్టలు లేదా సాఫ్ట్ న్యాపీ ఉపయోగించవచ్చు. రసాయన పదార్థాలు ఉన్న డిస్పోజబుల్ డైపర్లకు బదులుగా, ఇప్పుడు మార్కెట్‌లో ఆర్గానిక్ కాటన్ డైపర్లు, క్లాత్ డైపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి బిడ్డ చర్మానికి మృదువుగా ఉండటంతో పాటు పర్యావరణానికి కూడా హితకరం. వాటిని శుభ్రపరిచి మళ్లీ ఉపయోగించుకోవచ్చు.