ఒకరోజులో ఎన్ని అడుగులు నడవాలి? ఎన్ని అడుగులు నడిస్తే ఎంత మేలు జరుగుతుంది?
నడక ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతారు. అయితే ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఒకరోజులో ఎన్ని అడుగులు వేయాలనే విషయంలో ప్రతి ఒక్కరూ ఒక్కోరకంగా సమాధానం చెబుతారు. కొంతమంది రోజుకు 10వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని అంటారు. తాజా అధ్యయన ప్రకారం ఒకరోజులో 5వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటారని తేలింది. 2లక్షల 26 వేల మందిపై నిర్వహించిన అధ్యయనంలో, రోజుకు 4వేల అడుగులు నడిస్తే అనారోగ్యాల వల్ల మరణం సంభవించే అవకాశం తగ్గుతుందని తేలింది. అలాగే ఒక రోజులో 2300 అడుగులు నడిస్తే గుండెకు, రక్తనాళాలకు మంచి ఆరోగ్యం కలుగుతుందని వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని పోలాండ్ కి చెందిన యూనివర్సిటీ వారు చేపట్టారు.
నడక వల్ల వృద్ధులకు మరింత లాభం
4వేల అడుగులు దాటిన తర్వాత మరొక వెయ్యి అడుగులు ఎక్కువగా నడిస్తే తొందరగా మరణం సంభవించే అవకాశం 15% తగ్గుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఒక రోజులో 6వేల నుండి 10వేల అడుగులు నడిస్తే అనారోగ్యం వల్ల ఏర్పడిన వ్యాధుల కారణంగా మరణించే అవకాశం 42 శాతం తగ్గుతుంది. అందుకే రోజూ కచ్చితంగా నడవాలి. నడవడానికి సమయం లేదనకుండా సమయాన్ని కల్పించుకుని నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ పొద్దున్న అరగంటసేపు నడవడం ఈరోజు నుంచే అలవాటు చేసుకుని, రాబోయే అనారోగ్యాలను దూరం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.