LOADING...
Black Pepper Health Benefits : రోజు మిరియాలు తింటే ఇన్ని లాభాలా.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా?
రోజు మిరియాలు తింటే ఇన్ని లాభాలా.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా?

Black Pepper Health Benefits : రోజు మిరియాలు తింటే ఇన్ని లాభాలా.. నిపుణులు ఏం చెప్పారో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందిన మిరియాలు ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఆహారానికి కారం, రుచి అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో అనాదికాలం నుంచి మిరియాలను ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యల్లో ఇవి ప్రభావవంతమైన మందులా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిరియాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఒకసారి పరిశీలిద్దాం. నల్ల మిరియాలను 'బ్లాక్ గోల్డ్'గా పిలుస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ C, విటమిన్ K, ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Details

 జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

అంతేకాకుండా మిరియాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయని వారు వివరించారు. మిరియాలు జీర్ణరసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. మిరియాల్లో ఉండే 'పైపెరిన్' అనే క్రియాశీలక సమ్మేళనం పేగుల పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు. పైపెరిన్ మెదడు పనితీరుకు తోడ్పడడంతో పాటు పోషకాల శోషణను పెంచి జీర్ణాశయ వ్యవస్థను బలోపేతం చేస్తుందని National Library of Medicine అధ్యయనం వెల్లడించింది.

Details

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

మిరియాల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Details

శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం

మిరియాలు శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల్లో త్వరిత ఉపశమనాన్ని అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. జ్వరాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, శ్వాసకోశ, మూత్ర సంబంధిత వ్యాధుల ఆయుర్వేద చికిత్సల్లో మిరియాల వినియోగం ఉందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.

Advertisement

Details

బరువు తగ్గడంలో సహకారం

మిరియాలు శరీరంలో మెటబాలిజాన్ని పెంచి కొవ్వు వేగంగా కరిగేలా చేస్తాయని నిపుణులు తెలిపారు. పైపెరిన్ గుణాలు అధిక బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధించడం ద్వారా ఒబెసిటీని తగ్గించడంలో కూడా మిరియాలు సహాయపడతాయని వివరించారు. నల్ల మిరియాలు బరువు తగ్గించడమే కాకుండా సైనస్, ఉబ్బసం, ముక్కు రద్దీ సమస్యలను తగ్గిస్తాయని, అలాగే క్యాన్సర్, గుండె, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని worldwidejournals జర్నల్ ప్రచురించింది.

Details

క్యాన్సర్ నివారణలో పాత్ర

మిరియాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తాయని తెలిపారు. నల్ల మిరియాల్లోని పైపెరిన్ వివిధ రకాల క్యాన్సర్లపై యాంటీ ట్యూమర్ ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Details

డయాబెటిస్ నియంత్రణ

మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులోని పైపెరిన్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించడంలో తోడ్పడుతుందని నిపుణులు వివరించారు. గుండె ఆరోగ్యానికి మేలు మిరియాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తనాళాల్లో గడ్డకట్టకుండా నిరోధించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు తెలిపారు.

Details

ఇతర ప్రయోజనాలు

మిరియాల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులకు ఉపశమనాన్ని ఇస్తాయి. కాలేయాన్ని శుభ్రం చేసి దాని పనితీరును మెరుగుపరచడంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తహీనతను తగ్గించడంలో, నిద్రలేమిని తగ్గించి మంచి నిద్రకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. పైపెరిన్ ఇనుము, బీటా-కెరోటిన్ వంటి పోషకాల శోషణను పెంచుతుందని clevelandclinic అధ్యయనం వెల్లడించింది. మిరియాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ, కడుపులో మంట వంటి సమస్యలు ఉన్నవారు వాటిని మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యల చికిత్సలో భాగంగా మిరియాలను ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement