ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి
ఐబీఎస్ అనేది ప్రేగుల్లో ఏర్పడే రుగ్మత. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి, నీళ్ళ విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య అంత తొందరగా తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి మందులతో పాటు కొన్ని యోగాసనాలు కూడా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలాసనం: నిటారుగా నిల్చుని మోకాళ్ళను వంచి పాదాలు మొత్తం మడమతో సహా నేలకు ఆనేలా కూర్చోండి. ఆ తర్వాత మీ చేతులను మోకాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి నమస్కారం చేయండి. 10సెకన్ల వరకు ఇలానే ఉండండి. భుజంగాసనం: నేలమీద బోర్లా పడుకుని తలపక్కన అరచేతులను ఆనించి, మోచేతులు నిటారుగా అయ్యేవరకు నడుము వరకు భాగాన్ని పైకి లేపాలి. 10సెకన్ల తర్వాత సాధారణ స్థితికి వచ్చేయండి.
ఐబీఎస్ నుండి ఉపశమనం అందించే మరిన్ని యోగాసనాలు
ధనూరాసనం: నేలమీద బోర్లా పడుకుని నెమ్మదిగా కాళ్ళని వెనక్కి వంచండి. చేతులను సాగదీస్తూ కాళ్ళను పట్టుకోండి. శ్వాస తీసుకుని నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపండి. 20సెకన్ల తర్వాత నార్మల్ స్థితికి వచ్చేయండి. అపానాసనం: వెల్లకిలా పడుకుని మోకాళ్ళను వంచి పొట్టమీదకు కాళ్ళు వచ్చేలా చేసి, రెండు చేతులతో మోకాళ్ళను చుట్టేయండి. తలను, ఛాతిని పైకి లేపి మీ దవడ భాగంతో మోకాళ్ళను తాకడానికి ప్రయత్నించండి. 15సెకన్లు చేస్తే సరిపోతుంది. త్రికోణాసనం: కాళ్ళ మధ్య ఎక్కువ స్థలం ఉండేలా నిలబడండి. నడుమును పక్కకు వంచుతూ ఎడమ కాలిని కొంచెం బయటవైపు తిప్పండి. కుడిపాదాన్ని లోపలికి తిప్పండి. అలాగే వంగి మీ ఎడమ చేత్తో ఎడమ కాలిని ముట్టుకోండి. నిమిషం తర్వాత కుడివైపు చేయండి.