కళ్ళు పొడిబారడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కన్నీళ్ళు మీ కన్నులను శుభ్రపరుస్తాయి. దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కన్నీళ్ళు రాకపోతే కళ్ళు మంటగా అనిపించడం, కళ్ళలో ఏదో అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువైతే చూపు తగ్గిపోయి మసక మసగ్గా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు, దీని బారిన పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. కన్నులు పొడిబారడం అంటే: కళ్ళలో ఉండే లాక్రిమల్ గ్రంధుల నుండి కన్నీళ్ళు వస్తాయి. ఈ గ్రంధిలో కన్నీళ్ళు కావాల్సినన్ని ఉత్పత్తి కాకపోతే కళ్ళు పొడిబారతాయి. కొందరిలో కన్నీళ్ళు వచ్చినా తొందరగా ఆవిరైపోతాయి. లాక్రిమల్ గ్రంధులు సరిగ్గా పనిచేయకపోతే ఇలాంటి పరిస్థితి కలుగుతుంది.
పొడిగా మారడానికి కారణాలు
చుట్టు పక్కల వాతావరణం, ఆహార అలవాట్లు, స్క్రీన్ టైమ్ పెరగడం, కాంటాక్ట్ లెన్స్ అధిక వినియోగం, పొగ తాగడం మొదలైన వాటివల్ల కళ్ళు పొడిగా మారతాయి. డిప్రెషన్, అలర్జీ, బీపీ సమస్యలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాటరాక్ట్ సర్జరీ వల్ల కూడా కళ్ళు పొడిగా తయారవుతాయి. లేజర్ సర్జరీల వల్ల కళ్ళు పొడిగా మారే అవకాశం ఉంది. జాగ్రత్తలు: అలర్జీ కలిగించే ఆహారం తీసుకోకపోవడం, పొగ తాగకపోవడం, చదువుతున్నప్పుడు గానీ, ఫోన్ చూస్తున్నప్పుడు గానీ 20/20/20 రూల్ పాటించడం ఉత్తమం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన సప్లిమెంట్స్ తీసుకోవడం మంచింది. బయటకు వెళ్ళినపుడు దుమ్ము, ధూళి పడకుండా కళ్ళను సంరక్షించుకుంటే బాగుంటుంది.