Indrakeeladri: ఆధ్యాత్మిక కాంతితో శ్రీమహాలక్ష్మీ రూపంలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక వైభవంతో నిండి, ఆరో రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ప్రత్యేక అలంకారంలో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దేవాలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోగా, సకల రీతులలో అమ్మవారి కృపాకటాక్షాలు పొందడానికి భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ వైభవాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు చెబుతున్నారు.
ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను దర్శమిస్తున్న 'అమ్మవారు'
"యాదేవీ సర్వభూతేషు సంస్థితా..." అని చండీ సప్తశతి పేర్కొన్నట్లుగా, సమస్త జీవరాశుల్లో నివసించే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి. అందువల్ల శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం వంటి అనేక శుభఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ రోజు, శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మకు పంచభోగ నైవేద్యాలు - పాయసం, చక్రపొంగలి, లడ్డూ, పులిహోర, దద్దోజనం - సమర్పిస్తున్నారు.