Page Loader
motivation: చెవులు, కళ్ళు, నాలుక.. ఇవి మన సుఖానికే అడ్డుగా ఎందుకు మారతాయి..?
చెవులు, కళ్ళు, నాలుక.. ఇవి మన సుఖానికే అడ్డుగా ఎందుకు మారతాయి..?

motivation: చెవులు, కళ్ళు, నాలుక.. ఇవి మన సుఖానికే అడ్డుగా ఎందుకు మారతాయి..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మనిషి జీవితం మానసికంగా, భౌతికంగా సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం సహజం. బాధలు, కష్టాలను భరించడం తానేం కాదు, వాటిని ఊహించడానికే జంకుతాడు. అందుకే ప్రతీ పనికీ శుభ ముహూర్తాలు చూసి, దైవారాధనలు, పూజలు, వ్రతాలు చేస్తూ... ప్రవచనాలు, సుభాషితాలు వింటూ జీవితం సాగించాలనే తపన అతనిలో కనిపిస్తుంది. ఆ ఆచరణ ద్వారా తన జీవన మార్గాన్ని సుఖంగా మార్చుకోవాలనుకుంటాడు. ఈ విషయంలో మహాభారతంలోని విదురుని మాటలు అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి. ధృతరాష్ట్రునికి సూచిస్తూ, ఒకదానితో రెండింటిని నిర్ణయించుకోవాలి, మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకోవాలి, అయిదింటిని జయించాలి, ఆరింటిని తెలుసుకోవాలి, ఏడింటిని విడిచిపెట్టాలని సూచించాడు.

Details

బుద్ధి ఆధారంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం

ఒకదానితో రెండింటిని నిర్ణయించుకోవడమంటే మన బుద్ధిని ఉపయోగించి ఏది మంచిది, ఏది చెడో స్పష్టంగా తెలుసుకోవాలి. బుద్ధి ఆధారంగా మన నిర్ణయాలు ఉంటే, మన దారి సరైనదవుతుంది. మూడింటిని నాలుగింటితో వశపరచుకోవడమంటే మిత్రుడు, శత్రువు, తటస్థుడు అనే ముగ్గురినీ సామ, భేద, దాన, దండోపాయాలు అనే నాలుగు మార్గాల ద్వారా వశంలోకి తెచ్చుకోవాలి. పరిణామం ఎలా ఉన్నా, ఈ నైపుణ్యం సుఖసంపదలు సాధించడంలో దోహదపడుతుంది. అయిదింటిని జయించడమంటే మన ఐదు జ్ఞానేంద్రియాలు అయిన చెవి, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు... ఇవి మనసును విషయాలపట్ల ఆకర్షించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటిని జయించడం అంటే, వాటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండడం.

Details

ఈ విషయాలను తెలుసుకోవాలి

ఆరింటిని తెలుసుకోవడమంటే సంధి, విగ్రహం, యాన, ఆసన, ద్వైదీభావం, సమాశ్రయం అనే ఆరు విషయాలను తెలియజేస్తుంది. సంధి అంటే శత్రువునే మిత్రుడిగా మార్చుకోవడం విగ్రహం అనగా సరైన సమయంలో యుద్ధానికి సిద్ధపడడం యాన అంటే శత్రువు బలహీనతను గమనించి ఆ దిశగా ముందుకెళ్లడం ఆసనం అనగా పరిణామాల అనుసారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వైదీభావం అనగా బలవంతులతో సఖ్యతగా ఉండి, బలహీనులను ఎదుర్కొనడం సమాశ్రయం అంటే ఆయా విషయాల్లో నిపుణులను ఆశ్రయించడం. ఈ ఆరింటిని లోతుగా అర్థం చేసుకుని, ప్రతిసందర్భాన సరిగ్గా వినియోగించగలిగినవాడే నిజమైన సుఖాన్ని పొందగలడు.

Details

విడిచిపెట్టాల్సిన ఏడింటి విషయంలో విదురుని మాటలు మరింత స్పష్టత ఇస్తాయి. అవి

1. పరస్త్రీ వ్యామోహం 2. జూదం 3. వేట 4. మద్యపానం 5. పరుష సంభాషణ 6. హింస 7. ధన దుర్వినియోగం ఈ సప్తవ్యసనాల నుంచి దూరంగా ఉంటేనే జీవితం నిశ్చింతగా సాగుతుంది. వీటిని వదిలే గుణం మనిషిలో ఉంటే, అతను అసలైన అర్థవంతమైన సుఖాన్ని అనుభవించగలడు. ఈ విధంగా చూస్తే, పురాణ సాహిత్యం కేవలం ఆధ్యాత్మికత కోసం కాదు - అది ప్రతీ మనిషికి జీవితాన్ని వెలుగునిచ్చే మార్గదర్శకంగా ఉంటుంది. మన నడక, మన ప్రవర్తనే లోకానికి మన పరిచయం. సుఖాన్ని కోరుతూ అధోగతిలో పడకుండా, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని, మానవతావంతంగా జీవించడం మనిషిగా మనగడమే. మన పురాణాలు చెబుతున్న గొప్ప సందేశం ఇదే.