Earth Day 2026: ఆఖరి అంచునా అవని?.. మోగిన అత్యవసర హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
మనమంతా పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక పర్యావరణ సమయ బాంబుపై కూర్చున్నామనే మాట అతిశయోక్తి కాదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేగంగా కరుగుతున్న మంచు గడ్డలు, అంచనా వేయలేని ప్రకృతి విపత్తులు వరుసగా సంభవించడం ఇవన్నీ భూమి మనకు ఇస్తున్న తీవ్రమైన సంకేతాలు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మనకు మిగిలిన సమయం చాలా తక్కువని శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరిత్రీ దినోత్సవం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది.
వివరాలు
ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటున్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, భూమి వేడెక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో మానవాళికి ఐక్యరాజ్యసమితి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. భూ వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికర వాయువులను తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. లేదంటే పర్యావరణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని తిరిగి కోలుకోలేని స్థితికి చేరుకుంటుందని హెచ్చరించింది.
వివరాలు
పరిష్కారం మన చేతుల్లోనే..
ఈ క్లిష్ట పరిస్థితుల్లో భూమిని రక్షించే శక్తి మనందరిలోనే ఉందనే విషయాన్ని ఈ దినోత్సవం గుర్తుచేస్తోంది. 1970లో చిన్న స్థాయి నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలను కలుపుకుంటున్న మహా కార్యక్రమంగా మారింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతను నిర్వర్తించడం తప్పనిసరి.
వివరాలు
పర్యావరణ ఉద్యమం ఆరంభం
1970లలో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీటి కోసం సరైన చట్టాలు లేకపోయాయి. 1962లో రచయిత్రి రాచెల్ కార్సన్ రాసిన 'సైలెంట్ స్ప్రింగ్' పుస్తకం రసాయనాల వల్ల కలిగే నష్టాలను ప్రపంచానికి తెలియజేసింది. 1969లో కుయహోగా నదిలో చమురు కారి మంటలు చెలరేగిన ఘటన ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ సంఘటనల ప్రభావంతో పర్యావరణవేత్త, అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ 1970 ఏప్రిల్ 22న తొలి ధరిత్రీ దినోత్సవాన్ని ప్రారంభించారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా విస్తరణ
మొదటిరోజే దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి మద్దతు తెలపడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఆస్పందనతో ఈ ఉద్యమం నేడు 192దేశాల్లో లక్షలాది సంస్థల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమంగా ఎదిగింది. ప్రస్తుతం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయని, ప్రపంచ దేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ శాస్త్రవేత్త జేన్ గూడాల్ హెచ్చరిస్తున్నారు. 2026 నినాదం: మన శక్తి, మన గ్రహం ఈ ఏడాది ధరిత్రీ దినోత్సవ నినాదం'మన శక్తి, మన గ్రహం'.పర్యావరణ రక్షణలో ప్రభుత్వాల పాత్రతో పాటు సాధారణ ప్రజల దైనందిన చర్యలు కూడా కీలకమని ఇది తెలియజేస్తోంది. పాఠశాలలు,వ్యాపార సంస్థలు,సమాజాలు,ప్రతి పౌరుడు తమ పరిసరాలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఈ నినాదం పిలుపునిస్తోంది.
వివరాలు
ప్రతి ఒక్కరి బాధ్యత
భూమిని కాపాడే ఈ ప్రయత్నంలో సామాన్యులు కూడా సులభంగా భాగస్వాములు కావచ్చు. స్వచ్ఛంద సేవకులుగా నమోదు కావడం, స్థానిక స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ ఉద్యమంలో చేరవచ్చు. ఇంటి వద్దే పూల మొక్కలు నాటడం ద్వారా తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించడం,రసాయన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం,నీటిని ఆదా చేయడం వంటి చిన్నచిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరి కృషితోనే భూమిని రక్షించడం సాధ్యమవుతుంది.