కృష్ణాష్టమి: కృష్ణుడి గురించి మీ పిల్లలకు తెలియజేయడానికి ఆడించాల్సిన ఆటలు
కృష్ణాష్టమి.. అంటే కృష్ణుడి పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ పండగను జరుపుకుంటారు. కృష్ణాష్టమి అనగానే అందరికీ గుర్తొచ్చేది పిల్లలే. తమ పిల్లలకు కృష్ణుడి వేషధారణ వేయించి ఫోటోలు తీసుకోవడం చాలా మంది తల్లిదండ్రులకు అలవాటు. ఈసారి కేవలం కృష్ణుడి గెటప్ మాత్రమే కాకుండా కృష్ణుడి గురించి తెలియజేయడానికి మీ పిల్లలతో కొన్ని ఆటలు ఆడించండి. అవేంటో చూద్దాం. ట్రెజర్ హంట్: ఒక పాత్రలో నెయ్యి పోసి దానికి మూత పెట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన దాచిపెట్టండి. ఆ తర్వాత అందరికంటే చిన్న పిల్లాడి కాళ్లకు బియ్యపు పిండి పూసి కాలి ముద్రలు పడేలా ఇంట్లో తిరగనివ్వండి. ఆ ముద్రలను బట్టి నిధి ఎక్కడుందో మీ పెద్ద పిల్లలను కనుక్కోమని చెప్పండి.
పిల్లలతో ఆడించాల్సిన ఆటలు
మట్టి బొమ్మలు: మార్కెట్లో దొరికే బంకమట్టి తీసుకువచ్చి కృష్ణుడి రూపాన్ని తయారు చేయించండి. మట్టితో ఆడుకోవడం పిల్లలకు చాలా ఇష్టం. కృష్ణుడి రూపాన్ని, అలాగే కృష్ణుడు ధరించే పిల్లనుగ్రోవి, నెమలీక, కిరీటం మొదలు వాటిని తయారు చేయించండి. మజ్జిగ తయారీ: కృష్ణాష్టమి రోజున ఖచ్చితంగా ప్రసాదం చేసుకుంటారు. అందులో మజ్జిగ కూడా ఉంటుంది. అయితే మజ్జిగ తయారు చేయడంలో మీ పిల్లలను భాగస్వాములను చేయండి. ఇది పిల్లల్లో మంచి ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. పూజగది అలంకరణ: కృష్ణాష్టమి రోజున పూజ గదిలో చిన్న ఊయల ఏర్పాటు చేస్తారు. అలాగే దానికి అలంకరణ చేస్తారు. అలంకరణ చేయడంలో మీ పిల్లలను భాగస్వాములను చేయండి.