LOADING...
Financial Lessons: పిల్లలకు డబ్బు విలువ నేర్పుతున్నారా?.. ఆర్థిక అవగాహన అవసరమంటున్న నిపుణులు
పిల్లలకు డబ్బు విలువ నేర్పుతున్నారా?.. ఆర్థిక అవగాహన అవసరమంటున్న నిపుణులు

Financial Lessons: పిల్లలకు డబ్బు విలువ నేర్పుతున్నారా?.. ఆర్థిక అవగాహన అవసరమంటున్న నిపుణులు

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. అందుకోసం మంచి విద్య అందించేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. అయితే, విద్యతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు చిన్ననాటి నుంచే డబ్బు నిర్వహణ, పొదుపు, పెట్టుబడుల వంటి అంశాలపై అవగాహన కల్పించాలని చెబుతున్నారు. మరి పిల్లలకు ఆర్థిక జ్ఞానం ఎలా నేర్పాలో తెలుసుకుందాం.

వివరాలు

ఆర్థిక విషయాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయండిలా..

సమాజం మారుతున్నప్పటికీ, ఇప్పటికీ చాలామంది ఆర్థిక నిర్ణయాల విషయంలో ఇతరులపై ఆధారపడుతున్నారు. అందుకే పిల్లలు భవిష్యత్తులో స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా చిన్నప్పటి నుంచే వారికి శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో జరిగే ఆర్థిక చర్చల్లో వారిని కూడా భాగస్వామ్యం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఖర్చులు, పొదుపు, పన్నులు, ఆర్థిక ప్రణాళిక వంటి విషయాలపై వారికి స్పష్టత వస్తుంది. అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని సేవ్ చేయడం, చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం వంటి అలవాట్లు పెంపొందేలా ప్రోత్సహించాలి. అప్పుడు వారు డబ్బు విషయాల్లో ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

వివరాలు

పిల్లలకు డబ్బు విలువ అర్థమయ్యేలా చేయండి

ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోరికలన్నీ వెంటనే తీర్చేందుకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అడిగిన ప్రతి వస్తువూ వెంటనే కొనివ్వడం వల్ల పిల్లలకు డబ్బు విలువ తెలియకపోవచ్చు. ఇది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వారికి తెలియజేయాలి. పిల్లలు చేయగలిగే చిన్న పనులను అప్పగించి, వాటిని బాగా పూర్తి చేస్తే కొంత పారితోషికం ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. పని సరిగా చేయకపోతే తక్కువ మొత్తమే ఇవ్వాలి. ఇలా చేస్తే డబ్బు సులభంగా రాదనే విషయం వారికి అర్థమవుతుంది. దీంతో వారు డబ్బును జాగ్రత్తగా వినియోగించడం నేర్చుకుంటారు.

Advertisement

వివరాలు

అవసరం - కోరిక మధ్య తేడా చెప్పాలి

మనకు నిజంగా అవసరమైనవి, కేవలం కావాలనిపించే వస్తువులు రెండింటి మధ్య పెద్ద తేడా ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల వారు ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, పిల్లలు ఏదైనా వస్తువు కొనమని అడిగితే అది నిజంగా అవసరమా? లేక కేవలం ఇష్టమా? అనే ప్రశ్న వారితో చర్చించాలి. ఈ అలవాటు క్రమంగా పెరిగితే వారు డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించే స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు.

Advertisement

వివరాలు

చిన్ననాటి నుంచే పొదుపు అలవాటు చేయాలి

కొంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత అవసరానికి మించి షాపింగ్ చేస్తూ డబ్బును వృథా చేస్తుంటారు. మరికొందరు క్రెడిట్ కార్డులను అదుపు లేకుండా వినియోగిస్తూ అప్పుల్లో పడుతున్నారు. ఇలాంటి అలవాట్లు ఆర్థిక సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పొదుపు చేసే అలవాటు చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంపొందించాలి. సేవింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి. అలాగే వయసు పెరిగే కొద్దీ చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా కూడా వారిని ప్రోత్సహించడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement