డెంగ్యూ నుండి రికవరీ అయ్యే సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు
దేశంలో చాలా ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనేక కారణాలవల్ల డెంగ్యూ బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. డెంగ్యూ బారి నుంచి సాధారణ స్థాయికి రావడానికి చాలా టైం పడుతుంది. అయితే డెంగ్యూ బారి నుండి రికవరీ అయ్యే సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాలు: అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు మొదలైన వాటిలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. రోజువారి ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి.
దానిమ్మ
డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఈ పండును తప్పకుండా తినాలి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఇతర పోషకాలు ఉంటాయి. అనేక పోషకాలు ఉండడం వల్ల అలసట వంటి ఇబ్బందులు ఉండవు. డెంగ్యూ వచ్చిన సమయంలో ప్లేట్ లెట్స్ పడిపోవడం సాధారణ సమస్యగా ఉంటుంది. వాటిని తొందరగా పెంచడంలో దానిమ్మ సాయపడుతుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచడంలో కొబ్బరినీళ్లు సాయపడతాయి. అంతేకాదు, ఇది మీకు శక్తినిందించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి రోజూ రెండు గ్లాసుల కొబ్బరినీళ్లు తాగండి.
హెర్బల్ టీ
డెంగ్యూ బారి నుండి రికవరీ అయ్యే సమయంలో శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే హెర్బల్ టీ తాగండి. యాలకులు, పెప్పర్మింట్, దాల్చిన చెక్క, అల్లం మొదలగు వాటితో తయారయ్యే టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు: డెంగ్యూ నుండి రికవరీ అయ్యే సమయంలో పెరుగును కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలోని విష పదార్థాలను బయటకి తొలగించడంలో పెరుగు ఉపయోగపడుతుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడంలో పెరుగు సాయపడుతుంది. ఓట్ మీల్: ఓట్ మీల్ చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల సులభంగా జీర్ణం అవుతుంది. మరో విషయం ఏంటంటే, దీన్ని మీరు ఎక్కువగా తిన్నా కూడా మీకు చికాకు అనిపించదు. శరీరానికి శక్తిని అందించడంలో ఓట్ మీల్ సాయపడుతుంది.