శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రత్యేక ఆహారాలు నిజంగా ఉన్నాయా? ఇది తెలుసుకోండి
డిటాక్స్ టైట్.. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు తొలగించే ఆహారాలను డిటాక్స్ డైట్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇలా విష పదార్థాలను తొలగించే పద్ధతిని డిటాక్సిఫికేషన్ అంటారు. అయితే సైన్స్ లో డిటాక్సిఫికేషన్ అనే దానికి సరైన నిరూపణ లేదు. అంటే మీరు తీసుకునే ప్రత్యేకమైన ఆహారాలు శరీరంలోని విష పదార్థాలను నిజంగా దూరం చేస్తాయన్నదానికి శాస్త్రీయమైన రుజువు లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చాలామంది ఉపవాసం ద్వారా, పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, నీళ్లు ఇంకా కొన్ని మూలకాలతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు.. మూత్రం మలం, చెమట ద్వారా బయటకు పోతాయని చెబుతారు.
డిటాక్స్ డైట్ ద్వారా ఆరోగ్యం
డిటాక్స్ డైట్ లోని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు బాగా అందుతాయన్నది నిజం. కావలసినన్ని నీళ్ళు తాగడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఈ డైట్ లో ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకుండా ఉంటారు కాబట్టి మంచి ఆరోగ్యం అందుతుంది. డిటాక్స్ డైట్ కారణంగా శరీరంలోని మలినాలు తొలగిపోతాయని విషయమై వైద్య పరంగా ఎలాంటి ప్రూఫ్ లేదు. నిజానికి శరీరానికి ప్రత్యేకమైన డిటాక్స్ అవసరంలేదని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని మలిన పదార్థాలను బయటకు పంపి వేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది.
డిటాక్స్ డైట్ పని చేసేది కొద్దికాలం మాత్రమే
ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని మలిన పదార్థాలు బయటకి నిజంగా వెళ్లిపోతాయనే విషయంలో నిరూపణ కాలేదు. డిటాక్స్ డైట్ పాటించిన రోజుల్లో మీరు బరువు తగ్గినట్లయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ డైట్ పాటించకపోతే మళ్లీ మీ బరువు సాధారణ స్థాయికి చేరుతుంది. చివరగా చెప్పే విషయం ఏంటంటే, డిటాక్స్ డైట్ విషయంలో ఆలోచన చేస్తూ మీ డైట్ లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిది. లేదంటే డైట్ లోని మార్పుల కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.