గ్లోబల్ రన్నింగ్ డే: శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచే పరుగు వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
పొద్దున్న లేవగానే పరుగెత్తే అలవాటు మీకుందా? కనీసం జాగింగ్ అయినా చేస్తారా? ఈ అలవాట్లు మీకు లేకపోతే ఇప్పుడే అలవర్చుకోండి. ఎందుకంటే పరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈరోజు గ్లోబల్ రన్నింగ్ డే. పరుగెత్తే వారిని ప్రోత్సహించడానికి, పరుగు అలవాటు లేని వారిలో అవగాహన కలిగించి పరుగు వైపు మళ్ళించడానికి ప్రతీ ఏడాది జూన్ 7వ తేదీన గ్లోబల్ రన్నింగ్ డే నిర్వహిస్తారు. రోజూ సొంతసేపు పరుగెత్తడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ప్రస్తుతం పరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: రోజూ పరుగెత్తడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా మీ శరీరంలో ఇబ్బందులు తలెత్తవు.
గుండె వ్యాధులు రాకుండా కాపాడే పరుగు
హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి: పరుగెత్తడం వలన గుండె సంబంధ ఇబ్బందులు దూరమవుతాయి. ధమనుల్లో రక్తం గడ్డకట్టడం మొదలగు సమస్యలు తొలగిపోయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ పదినిమిషాల పరుగు, మీకు గుండె సంబంధ సమస్యలను రానివ్వకుండా చేస్తుంది. ఎముకలు బలంగా మారతాయి: వేగంగా పరుగెత్తకపోయినా, నార్మల్ గా జాగింగ్ చేసినా మీకు ఆరోగ్యం అందుతుంది. దీనివల్ల ఎముకలు బలపడతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు కేలరీలు తగ్గిపోయి బరువు తగ్గుతారు. మానసిక ఆరోగ్యం పెరుగుతుంది: పరుగెత్తడం వల్ల శరీరం ఎంత యాక్టివ్ గా మారుతుందో మనసు కూడా అంతే యాక్టివ్ గా మారుతుంది. శరీరాన్ని ఆరోగ్యాన్ని ఉంచుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.