Strawberry plants: చలికాలంలో మీ బాల్కనీలో స్ట్రాబెర్రీలు మొక్కలను ఎలా పెంచాలంటే..?
స్ట్రాబెర్రీలు అనేవి రుచికరమైన పండ్లు మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల తరచూ వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రటి రంగుతో నోరూరించే వీటిని ఇళ్లలో పెంచే వారు తక్కువే ఉంటారు. కానీ, వీటిని ఇంటి బాల్కనీలో లేదా పెరట్లో సులభంగా పెంచవచ్చు. ఇంట్లో స్ట్రాబెర్రీలను సులభంగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీ విత్తనాలను సేకరించడం
నర్సరీ నుంచి మొక్కల్ని కొని తెచ్చుకోవచ్చు లేదా స్ట్రాబెర్రీ పండులో ఉన్న విత్తనాలను సేకరించి వాటిని నాటుకోవచ్చు. పండును కోసిన తర్వాత దాని చర్మం నుంచి విత్తనాలను జాగ్రత్తగా తీసి, తడిగా ఉన్న ఒక క్లాత్ పై ఉంచాలి. వీటిని తేమ ఉంచే కంటైనర్లో చీకటి ప్రదేశంలో ఉంచితే అవి కొద్ది రోజుల్లో మొలకలు రావడం ప్రారంభిస్తాయి. విత్తనాలను నాటడం: కుండీల్లో మృదువైన మట్టి, కోకోపీట్ కలిపి, ఒక్కొక్క కుండిలో ఆరు విత్తనాలను రెండు నుండి నాలుగు సెంటీమీటర్ల లోతులో నాటాలి. తర్వాత మట్టితో నిదానంగా కప్పేయాలి.
మెరుగైన మట్టిని ఎంచుకోవడం
స్ట్రాబెర్రీలకు కొద్దిగా ఆమ్ల స్వభావం ఉన్న మట్టి అనుకూలం. కాబట్టి మట్టి, ఆర్గానిక్ కంపోస్టు, కోకోపీట్ కలిపి మంచి పోషక మట్టిని సిద్ధం చేయాలి. ఈ కుండీలను రోజుకు గంట పాటు సూర్యకాంతి తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఎర్రటి ఎండను మాత్రం తప్పించాలి. నర్సరీ నుంచి చిన్న మొక్కలు తెచ్చుకున్నట్లయితే: నర్సరీ నుంచి చిన్న మొక్కలు తెచ్చుకుంటే, రోజుకు కనీసం నాలుగు గంటల సూర్యకాంతి అవసరం. మొక్కలను నీటితో చిలకరిస్తూ ఉండాలి. రెండు నెలల కాలంలో ఇవి ఆరోగ్యంగా ఎదుగుతాయి. సరైన ఎరువులను ఉపయోగిస్తే, 90 రోజుల్లో స్ట్రాబెర్రీలు పండించడం మొదలవుతుంది.
ఫలాలు తెంపడం
స్ట్రాబెర్రీలను కాండం నుంచి కిందకు వంగిన తర్వాతనే జాగ్రత్తగా తెంపాలి. ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు కోసితే ఉపయోగం ఉండదు. అవి పూర్తిగా ఎరుపు రంగులోకి మారాక కోయడం మంచిది. ఓపికతో పెంచుకుంటే, మొదటిసారి తర్వాత మరింత సులభంగా స్ట్రాబెర్రీలను పెంచగలుగుతారు.