హైడ్రో పోనిక్స్: మట్టి లేకుండా నీటితో ఆకు కూరలను ఈజీగా పెంచండి
మట్టి లేకుండా మొక్కలను పెంచడం సాధ్యమా అన్న ప్రశ్న మీకు కలగవచ్చు. ఆకుకూరలను పెంచడం అస్సలు సాధ్యం కాదని అనిపించవచ్చు కూడా. కానీ హైడ్రోపోనిక్స్ ద్వారా మట్టి లేకుండా ఆకుకూరలను పెంచవచ్చు. అవును ఈ పద్ధతికి మట్టి అవసరం లేదు. అసలు హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటి? మట్టి అవసరం లేకుండా కేవలం నీటితో మాత్రమే మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఈ పద్ధతిలో మట్టి అవసరం లేకుండా నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మొక్కలు పెంచాలనుకునేవారు, కొన్ని పెద్ద సైజు పైపు గొట్టాలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ పైపులకు ఒకవైపు దూరం దూరం రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాల్లో చిన్న కుండీలు పెట్టి అందులో వేర్లతో ఉన్న మొక్కను ఉంచుతారు.
ఎండ తగిలే ప్రదేశం మాత్రమే అవసరం
ఆ తర్వాత గొట్టాల్లో ఎప్పుడూ నీరు పారేలా చూసుకోవాలి. గొట్టాల్లోని నీరు మొక్కలకు అందేలా రాళ్ళతో ఆ గొట్టాలను నింపాలి. ఇప్పుడు మొక్కకు కావాల్సిన పోషకాలు అందజేయడానికి బయట నుంచి ఆ గొట్టాల్లో కలపాల్సి ఉంటుంది. దీనివల్ల మొక్కలు పెరిగి పెద్దవుతాయి. అయితే ఇది అన్ని రకాల కూరగాయల మొక్కలు పెంచడానికి పనికిరాదు. ఆకుకూరలను, పూల మొక్కలను ఈ పద్ధతి ద్వారా సులభంగా పెంచవచ్చు. మార్కెట్లో దొరికే ఆకుకూరల్లో రసాయనాలు కలుస్తున్నాయన్న ఆందోళనలో మీరుంటే ఇలాంటి పద్ధతి ద్వారా ఇంట్లోనే ఆకుకూరలను పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలో కూరలు పెంచడానికి పెద్దగా స్థలం అవసరం ఉండదు. కొంచెం ఎండ తగిలే ప్రదేశంలో పైపు గొట్టాలను పెట్టాల్సి ఉంటుంది.