నీరసాన్ని దూరం చేయడం నుండి క్యాన్సర్ల నివారణ వరకు వెలగపండు ప్రయోజనాలు
వెలగపండు.. ఇది సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే దొరుకుతుంది. వినాయక చవితి నుండి మొదలుకొని వేసవి వరకు ఈ పండు లభ్యమవుతుంది. ఆయా ఋతువుల్లో దొరికే పండ్లను కచ్చితంగా తినాలని, దానివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామంది చెబుతారు. వెలగపండు వల్ల కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రస్తుతం అవేంటో తెలుసుకుందాం. మలబద్ధకాన్ని దూరం: వెలగపండు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వెలగపండును ఔషధంగా ఉపయోగించవచ్చు. క్యాన్సర్ నివారణ: మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వంటి నివారణలో వెలగపండు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.
వెలగపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వెలగపండు వగరు, పులుపు కలిపిన రుచిని కలిగి ఉంటుంది. చర్మ సమస్యలను దూరం చేయడంలో వెలగపండు ఎంతగానో సాయపడుతుంది. తామర, గజ్జి మొదలగు వాటిని ఇది దూరం చేస్తుంది. ఇంకా గాయాలను తొందరగా మాన్పడంలో వెలగపండు లోని పోషకాలు సాయపడతాయి. బాగా అలసటగా ఉన్నట్లయితే వెలగపండు తినడం వల్ల సరికొత్త ఎనర్జీ వస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి తక్షణమే శక్తి వస్తుంది. వెలగపండు లోని పోషకాలు శరీరంలోని హానికర బ్యాక్టీరియాలతో పోరాడతాయి. అంటే శరీర రోగ నిరోధక శక్తిని వెలగపండు పెంచుతుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వెలగపండును తినాలని అంటారు. ఈ సమస్యలను దూరం చేయడంలో వెలగపండు లోని పోషకాలు సాయపడతాయి. మగవాళ్లలో వీర్యవృద్దికి వెలగపండు ఉపయోగపడుతుంది.