క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి
క్రిస్ మస్ పండగ సంబరాలు అప్పుడై మొదలయ్యాయి. ఆల్రెడీ అందరూ పండగ మూడ్ లోకి వెళ్ళిపోయారు. పండగ రోజు సరదాగా గడపడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. మీరు కూడా క్రిస్ మస్ రోజున హాయిగా ఆనందిస్తూ మీకు కావాల్సిన వారికి పార్టీ ఇవ్వాలనుకుంటున్నారా? ఐతే పార్టీ ఎలా ప్లాన్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి. అతిథుల జాబితా తయారు చేయండి. మీరు పెద్ద పార్టీ ఇవ్వాలనుకుంటే ఈ జాబితా అవసరం ఉండదు కానీ, ఉన్నంతలో మీకు దగ్గర వారితో పార్టీ ఎంజాయ్ చేయాలనుకుంటే ముందుగా ఎవరెవరిని ఆహ్వానించాలని అనుకుంటున్నారో లిస్ట్ తయారు చేయండి. వాళ్ళందరికీ ఇప్పుడే ఆహ్వానం పంపండి. ఎందుకంటే పండగ దగ్గర్లోనే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.
హాయిగొలిపే సంగీతం, ఆనందాన్నిచ్చే ఆహారం
మీ ఇంటిని అందంగా అలంకరించండి. ఒక మూలన క్రిస్ మస్ ట్రీని ఉంచండి. అది పండగ అనుభూతిని అందిస్తుంది. ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఖాళీగా ఉంచండి. పండగ అన్నప్పుడు అతిథులకు ఆహారం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్లకు బిర్యానీతో పాటు మరిన్ని వెరైటీలు చేయండి. చివర్లో స్వీట్ తప్పనిసరిగా ఉంచండి. పార్టీలో మ్యూజిక్ లేకపోతే మ్యాజిక్ రాదు. ఆహ్లాదంగా అనిపించే సంగీతంతో పాటు కాళ్ళు కదిపే పాటలు ప్లే చేయండి. పండగలో మరింత మజా రావాలంటే అతిథులందరితో కలిసి గేమ్స్ ఆడండి. ఫోన్ లను పక్కన పెట్టి ఇంట్లో ఆడడానికి వీలుగా ఉండే ఏ గేమ్ అయినా సరే ఆడండి.