Summer Trips in Telangana: వేసవి వచ్చేసింది.. పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చెయ్యడానికి.. తెలంగాణలో టాప్ ట్రిప్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల్లోనే వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా చదువులు, పరీక్షలతో బిజీగా గడిపిన పిల్లలు, వారికి తోడుగా కష్టపడిన తల్లిదండ్రులు ఈ సమయంలో కాస్త విశ్రాంతి, వినోదం కోరుకుంటారు. "ఈ వేసవిలో ఎక్కడికి వెళ్లాలి?" అన్న ఆలోచన ప్రతి ఇంట్లో వినిపిస్తుంది. అలాంటి వారికి తెలంగాణలోనే ప్రకృతి అందాలు, అటవీ విహారాలు, జలాశయాలు, ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలు ఆహ్వానం పలుకుతున్నాయి. తక్కువ ఖర్చుతో, మూడు నుంచి నాలుగు గంటల ప్రయాణంతోనే ఒకటి లేదా రెండు రోజుల్లో కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి, చరిత్ర, నిర్మాణ వైభవం కలిసిన ప్రదేశంగా నాగార్జునసాగర్ ప్రత్యేకంగా నిలుస్తుంది.
వివరాలు
'అనంత' ఆనంద 'గిరి'
సాగర్ జలాశయంలో పడవ విహారం ప్రధాన ఆకర్షణ. కృష్ణా నది తీరంలో విస్తరించిన బౌద్ధ వనంలో బుద్ధుడి జీవిత విశేషాలను తెలుసుకోవచ్చు. జలాశయం మధ్యలో ఉన్న దీవిలోని నాగార్జునకొండకు పడవలో వెళ్లడం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. వేసవిలో కొండ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి కొండలు మంచి ఎంపిక. పచ్చని అడవులు, చల్లటి వాతావరణం మధ్య పర్యాటకులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఉదయాన్నే మబ్బులతో కమ్ముకున్న వాతావరణం, అడవిలో నిశ్శబ్దం, చిన్నపాటి నడకలు, ప్రత్యేక అల్పాహారం వంటి అనుభవాలు ఆకట్టుకుంటాయి. సమీపంలోని కోట్‌పల్లి జలాశయంలో నీటి పరిస్థితిని బట్టి పడవ ప్రయాణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అనంతపద్మనాభస్వామి ఆలయ దర్శనం ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది.
వివరాలు
అమ్రాబాద్ అటవీ ప్రాంతం
నది, ఆలయం, అడవులు కలిసిన అందమైన ప్రాంతం సోమశిల. నల్లమల అడవులతో చుట్టుముట్టిన ఈ ప్రదేశంలో కృష్ణా నదిలో పడవ విహారం, అటవీ ఉద్యానవనం సందర్శనం, రుచికరమైన చేపల వంటకాలతో భోజనం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అటవీ ప్రాంతంలో నివాస సౌకర్యాలు కూడా ఉన్నాయి. సమీపంలోని కొల్లాపూర్ ప్రాంతం గతంలో రాజవంశ పాలనకు కేంద్రంగా ఉండటంతో అక్కడి పాత రాజభవనాలు చూడదగ్గవిగా నిలుస్తాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గంలో ఉన్న అమ్రాబాద్ అటవీ ప్రాంతం ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించే ప్రదేశం. జింకలు, పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, చిరుతలు వంటి వన్యమృగాలు, పక్షులతో జీవ వైవిధ్యం ఆకర్షిస్తుంది. అటవీ విహారంలో చారిత్రక కట్టడాలు, గిరిజన నివాసాలను కూడా చూడవచ్చు.
వివరాలు
కవ్వాల్ అటవీ ప్రాంతం
ఎత్తైన ప్రదేశం నుంచి చూసే లోయలు, వంపులు తిరిగే కృష్ణా నది అందాలు మనసును మైమరపింపజేస్తాయి. కవ్వాల్ అటవీ ప్రాంతం రాష్ట్రంలో మరో ముఖ్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇక్కడ పులులు, చిరుతలు, అడవి దున్నలు, సాంబార్ జింకలు, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. అటవీ విహారం, అడవిలో నివాసం వంటి సౌకర్యాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. జోడేఘాట్ ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన అటవీ గ్రామం.
వివరాలు
ఇంకా ఎన్నో.. మరెన్నో..
గిరిజన నాయకుడు కుమురం భీం నీరు, అడవి, భూమి కోసం పోరాడి ఇక్కడే వీరమరణం పొందారు. ఆయనకు సంబంధించిన స్మారక స్థలం, గిరిజన సంగ్రహాలయం అక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఇవి మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సముదాయం రామోజీ ఫిల్మ్ సిటీ, లక్నవరం చెరువు, రామప్ప దేవాలయం, వరంగల్ కోట, జోగులాంబ దేవాలయం, బాసర ఆలయం, కాళేశ్వరం వంటి అనేక పర్యాటక ప్రదేశాలు తెలంగాణలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.