ప్రపంచ మలేరియా దినోత్సవం 2023: మలేరియా ప్రభావాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు
మలేరియాపై ఆగాహన కల్పించడానికి, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుతారు. ప్లాస్మోడియం పరాన్నజీవి కారణంగా మలేరియా వ్యాపిస్తుంది. ఈ పరాన్నజీవి, దోమకాటు ద్వారా మనిషి శరీరంలోకి వెళ్తుంది. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. అంతకుముందు ఆఫ్రికా దేశాల వారు మాత్రమే ఆఫ్రికా మలేరియా దినోత్సవాన్ని జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం మలేరియా ప్రభావాన్ని తగ్గించే ఇంటిచిట్కాల గురించి తెలుసుకుందాం. పసుపు: పాలల్లో పసుపు కలుపుకుని మరగబెట్టి చల్లారిన తర్వాత అందులో తేనె కలుపుకుని తాగితే మలేరియా ప్రభావం నుండి కొంత మేర ఉపశమనం వస్తుంది. పసుపులో ఉండే పోషకాలు మలేరియా పరాన్నజీవిని చంపేస్తాయి.
దాల్చిన చెక్క, అల్లం, తులసి ఆకులు చేసే మేలు
దాల్చిన చెక్క: నీటిలో దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వేసి, కొంత తేనె కలుపుకుని తాగితే బాగుంటుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మలేరియా కారణంగా కనబడే లక్షణాలైన డయేరియా, జ్వరం, తలనొప్పులను తగ్గిస్తాయి. అల్లం: మలేరియాతో బాధపడేవారికి తరచుగా వాంతులు అవుతుంటాయి. అలాగే ఒళ్ళు నొప్పులు, వికారం ఇబ్బంది పెడుతుంటాయి. వీటినుండి ఉపశమనం కావాలంటే, కొన్ని అల్లం ముక్కలను నీళ్ళలో వేసి మరిగించి వడబోసి నీళ్ళలో తేనె కలుపుకుని తాగాలి. తులసి టీ: తులసి ఆకులను నీళ్ళలో వేసి మరిగించి, కొంచెం తేనె కలుపుకుని తాగాలి. తులసి ఆకుల్లో ఉండే పోషకాల కారణంగా మలేరియా వల్ల వచ్చే వికారం, డయేరియా లక్షణాలు తగ్గిపోతాయి.