
HYD: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కొత్త ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు భారీ పెరుగుదల
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారం, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. చాలామంది ఇక్కడే స్థిరపడేందుకు ప్రయత్నిస్తూ, సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు కొత్తగా ప్రారంభమవుతున్న హౌసింగ్ ప్రాజెక్టులవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్తగా ఇళ్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్ ఈక్విటీ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 9 మెట్రో నగరాల్లో కొత్తగా ప్రారంభమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో సగటు ప్రారంభ ధర 2024-25లో చదరపు అడుగుకు రూ.13,197కి చేరింది.
Details
నగరాల వారీగా ఇళ్ల ధరల్లో మార్పులు ఇలా ఉన్నాయి
ఇది గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉన్న రూ.12,569తో పోలిస్తే సుమారు 9 శాతం పెరిగినట్లు తెలిపింది. కోల్‌కతా: ధరల పెరుగుదల అత్యధికంగా 29% థానే: 17% పెరుగుదల బెంగళూరు: 15% పెరుగుదల పుణె: 10% పెరుగుదల ఢిల్లీ-ఎన్సీఆర్: 5% పెరుగుదల హైదరాబాద్: 5% పెరుగుదల చెన్నై: 4% పెరుగుదల నవీ ముంబయి: 3% ధరల తగ్గుదల ముంబయి: 3% తగ్గుదల
Details
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టుల్లో 2023-24లో చదరపు అడుగుకు సగటు ధర రూ.7,890 ఉండగా, 2024-25లో ఇది రూ.8,306కి పెరిగింది. ఇది సుమారు 5 శాతం పెరుగుదల అని ప్రాప్ ఈక్విటీ తెలిపింది. ఇదే సమయంలో బెంగళూరులో గతేడాది రూ.8,577గా ఉన్న చదరపు అడుగు ధర, ఇప్పుడు రూ.9,852 కి పెరిగింది. ఇక్కడ మాత్రం ధరలు తగ్గాయి దక్షిణ ముంబయిలోని నవీ ముంబయిలో 2023-24లో చదరపు అడుగుకు రూ.13,286 ఉండగా, 2024-25లో అది రూ.12,855కి తగ్గింది. ముంబయిలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. అక్కడ గతేడాది రూ. 35,215 గా ఉన్న చదరపు అడుగు ధర, ప్రస్తుతం రూ.34,026కి తగ్గింది.
Details
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
భూముల ఖరీదు పెరగడం, ముడి సరుకుల ధరలు అధికంగా ఉండటం వల్లే కొత్తగా ప్రారంభమయ్యే గృహ ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. దీంతో సొంతింటి కల నెరవేర్చాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.