LOADING...
Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ -అమృత్ భారత్ మధ్య తేడా ఏమిటి? ఏ రైలు మీకు ఉత్తమమైనది?
వందే భారత్ -అమృత్ భారత్ మధ్య తేడా ఏమిటి? ఏ రైలు మీకు ఉత్తమమైనది?

Vande Bharat vs Amrit Bharat: వందే భారత్ -అమృత్ భారత్ మధ్య తేడా ఏమిటి? ఏ రైలు మీకు ఉత్తమమైనది?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేగం, సామర్థ్యం, ప్రయాణికుల సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా దేశంలో రైలు రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కొత్త తరహా రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా రైల్వే వ్యవస్థ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు దేశంలో ప్రయాణ సౌకర్యాలను విస్తరించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంతర్ నగర వేగవంతమైన ప్రయాణం నుంచి ప్రాంతీయ సేవలు, తక్కువ ఖర్చుతో దీర్ఘదూర ప్రయాణం వరకు వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ రైళ్లు రూపొందించబడ్డాయి.

వివరాలు 

ముందూ వెనుకా ఇంజన్లు

దేశ రైల్వే రంగంలో మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో వందే భారత్, అమృత్ భారత్ అనే రెండు కొత్త రైళ్లను ప్రజలకు అందించారు. రెండూ ఆధునిక సాంకేతికతతో రూపొందించినప్పటికీ, లక్ష్యాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు రైళ్లలో ఒకేలా ఉన్న ముఖ్య అంశం ముందూ వెనుకా ఇంజన్లు ఉండే విధానం. దీనివల్ల రైలు త్వరగా వేగం అందుకోవడం, నిలిచిన తర్వాత మళ్లీ వేగంగా ప్రయాణం ప్రారంభించడం సులభమవుతుంది. వేగం విషయంలో చూస్తే వందే భారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. దీనితో పోలిస్తే అమృత్ భారత్ గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అందువల్ల వేగంలో వందే భారత్ ముందంజలో ఉంది.

వివరాలు 

పూర్తిగా శీతలీకరణ కోచ్‌లతో వందే భారత్ రైలు

సౌకర్యాల పరంగా ఈ రెండు రైళ్ల మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. వందే భారత్ రైలు పూర్తిగా శీతలీకరణ కోచ్‌లతో ఉంటుంది. స్వయంచాలక తలుపులు, వెనక్కి వాలే సీట్లు, విమానాన్ని తలపించే అంతర్గత నిర్మాణం వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ రైలు తొలి సర్వీస్ 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ఇక అమృత్ భారత్ రైలు సాధారణ, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఇందులో ప్రస్తుతం శీతలీకరణ కోచ్‌లు లేవు. స్లీపర్, సాధారణ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో శీతలీకరణ కోచ్‌లను కూడా చేర్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

Advertisement

వివరాలు 

భద్రతా సదుపాయాల విషయంలో రెండింటిలోనూ ఆధునిక ఏర్పాట్లు

టికెట్ ధరల విషయంలో కూడా ఈ రెండు రైళ్ల మధ్య గణనీయమైన తేడా ఉంది. వందే భారత్‌లో ప్రయాణించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ అమృత్ భారత్ రైలు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. అందువల్ల మధ్యతరగతి ప్రయాణికులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. భద్రతా సదుపాయాల విషయంలో రెండింటిలోనూ సమానంగా ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయి. రెండు రైళ్లలోనూ CCTV కెమెరాలు, బయో-టాయిలెట్లు, మెరుగైన సీటింగ్ వంటి ఆధునిక భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకుంటే..

మీరు తక్కువ సమయంలో, అధిక సౌకర్యాలతో ప్రయాణించాలనుకుంటే వందే భారత్ సరైన ఎంపిక. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకుంటే అమృత్ భారత్ ఉత్తమ ప్రత్యామ్నాయం. మొత్తానికి, సామాన్యుల నుంచి ఆర్థికంగా బలమైనవారి వరకు ప్రతి ఒక్కరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ రెండు రైళ్లను ప్రవేశపెట్టింది. ఆధునిక ప్రయాణ అనుభూతిని అందించాలనే లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.

Advertisement