Parallel Marriage: 'ప్యారలల్ మ్యారేజ్'… అగ్ని సాక్షిగా ఒకటైన బంధం ఎందుకు దూరం అవుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
రెండు మనసులు ఒక్కటై,ఇరు కుటుంబాల సమ్మతితో అగ్నిని సాక్షిగా పెళ్లి చేసుకుని ఏడు అడుగులు నడిచిన దంపతులు... మూడుముళ్ల బంధంతో జీవితాన్ని మొదలుపెడతారు. అయితే మారుతున్న ఆధునిక సాంకేతిక కాలంలో,తెలియకుండానే కొందరు భార్యాభర్తలు 'ప్యారలల్ మ్యారేజ్' అనే ప్రమాదకర పరిస్థితిలోకి జారిపోతున్నారు. ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ,పిల్లల బాధ్యతలు పంచుకుంటూ,వీకెండ్‌ల్లో షాపింగ్‌కు వెళ్లినా కూడా... మనసుల్లో మాత్రం చెప్పలేని దూరం ఉందని బాధపడుతుంటారు. మీకూ మీ భార్య లేదా భర్తతో ఇలాంటి అనుభూతి ఉంటే, మీరు కూడా 'ప్యారలల్ మ్యారేజ్' అనే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. అసలు ప్యారలల్ మ్యారేజ్ అంటే ఏమిటి? దీని వల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుందా? ఈ పరిస్థితిని ఎలా సరిదిద్దుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
ప్యారలల్ మ్యారేజ్ అంటే ఏమిటి?
సైకాలజిస్టుల మాటల్లో చెప్పాలంటే..భార్యాభర్తలు ఇద్దరూ రైలు పట్టాల్లా పక్కపక్కనే ప్రయాణిస్తారు కానీ,వారి మనసులు మాత్రం కలవవు. ఈపరిస్థితినే 'ప్యారలల్ మ్యారేజ్'అంటారు.బయటకు చూస్తే వారు ఆదర్శ దంపతులు, బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల్లా కనిపిస్తారు.కానీ వారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే... ఎవరి ప్రపంచం వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఒకే గదిలో ఉన్నాఇద్దరు అపరిచితుల్లా జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది.నిజానికి ఈ రోజుల్లో చాలా మంది విడాకులకు దారి తీస్తున్న ప్రధాన కారణం గొడవలు కాదని,ఒకరిపై ఒకరికి ఏర్పడే దూరమేనని నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం,దాదాపు 55 శాతం విడాకులకు ఇదే కారణమని వెల్లడైంది. గొడవ పడితే అప్పుడైనా వారి మనసులో ఉన్నది బయటపడుతుంది,కానీ భార్యాభర్తల మధ్య నెలకొనే ఈ'మౌనం' మాత్రం వారి బంధాన్ని నెమ్మదిగా,నిశ్శబ్దంగా కూల్చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
ఇలా ఎందుకు జరుగుతోంది?
ఆఫీస్ డెడ్‌లైన్లు, పని ఒత్తిడి, పిల్లల చదువులు, హోంవర్కులు, ఇంటి బాధ్యతలు... ఇలా రోజువారీ బిజీలో చాలామంది దంపతులు తమ భావాలను పంచుకోవడానికే సమయం కేటాయించలేకపోతున్నారు. మరికొందరు "మాట్లాడితే మళ్లీ గొడవ అవుతుంది" అనే భయంతో మౌనానికే అలవాటు పడుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ కేవలం ఒక డ్యూటీ చేసినట్టే జీవితం గడుపుతున్న భార్యాభర్తలూ ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోందని అనిపిస్తే ఈ సూచనలు పాటించండి…
రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా ఫోన్లు పక్కన పెట్టి, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రశాంతంగా మాట్లాడుకునే అలవాటు చేసుకోండి. దంపతులిద్దరూ కలిసి ఏదైనా కొత్త పని ప్రారంభించండి. వంట చేయడం కావచ్చు, డాన్స్ నేర్చుకోవడం కావచ్చు లేదా కొత్త ప్రదేశానికి ట్రిప్ వెళ్లడం కావచ్చు. గొడవ పడటానికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి... గొడవ విమర్శ కోసం కాదు, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి మాత్రమే. ఎంత బిజీగా ఉన్నా, వారానికి కనీసం ఒకసారి అయినా పూర్తిగా మీ ఇద్దరి కోసమే సమయం కేటాయించండి. పెళ్లి అనేది కేవలం బాధ్యతలు పంచుకోవడం మాత్రమే కాదు,భావోద్వేగాలను కూడా పంచుకోవడం. వైవాహిక జీవిత నావను విడివిడిగా కాకుండా,కలిసి ముందుకు నడిపించండి.