పిల్లల పెంపకం: పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలియజేసే లక్షణాలు
పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఎలా ఉన్నారు? ఏం ఫీలవుతున్నారు? తెలుసుకోకపోతే వాళ్ళు పడే ఇబ్బందులను కనిపెట్టలేరు. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు కూడా ఒక్కోసారి ఒంటరితనంతో బాధపడతారు. ఈ పరిస్థితిని తొందరగా కనిపెట్టకపోతే అది వారి మనసుల్లో అలాగే ఉండిపోయి అనేక విపరీతాలకు దారి తీస్తుంది. అసలు పిల్లలకు ఒంటరితనం ఎందుకు వస్తుంది? స్కూలు, ఇల్లు, ప్రాంతం, దేశం మారినపుడు పిల్లల్లో ఒంటరితనం కలగవచ్చు. కొందరు కొత్త ప్రదేశాలకు వెళ్తే ఆనందపడతారు. మరికొందరు పాత ప్రదేశాన్ని విడిచినందుకు బాధపడతారు. ఇంటిసభ్యులు, పెంచుకునే కుక్క, లేదా మంచి స్నేహితుడు తమను విడిచి దూరంగా వెళ్ళిపోయినపుడు ఒంటరినంతో పిల్లలు బాధపడతారు.
పిల్లలు ఒంటరిగా ఉన్నారని గుర్తించడానికి సంకేతాలు
చుట్టుపక్కలు పిల్లలంతా కలిసి ఒకరిని బాగా ఏడిపించినపుడు కూడా ఒంటరిగా ఫీలవుతారు. పిల్లలు ఒంటరిగా ఉన్నారని ఎలా గుర్తించాలంటే: మీ పిల్లలు మరీ ఎక్కువగా సిగ్గుపడుతున్నా, ఏదైనా పని చేయమంటే చేయనని చెబుతున్నా కూడా వాళ్ళ మనసులో ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. అమ్మానాన్నలను అస్సలు వదలకపోవడం, ఏమైనా అంటే ఎక్కువగా ఏడవడం, ఏ పనిలోనూ ఆసక్తి లేకపోవడం, తమ మీద తమకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. కొన్ని కొన్నిసార్లు డిప్రెషన్ కారణంగా ఒంటరితనం వస్తుంది. దాంతో స్నేహితులతో కలవకుండా ఉంటారు. ఒక్కరే ఉంటూ ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడరు. ఈ ఒంటరితనం ఎక్కువతే ఇంట్రోవర్ట్ గా మారతారు.