అంతర్జాతీయ పిచ్చిగీతల దినోత్సవం: పిల్లల్లో క్రియేటివిటీని పెంచాలంటే పిచ్చిగీతలు గీయించండి
పిచ్చిగీతలతో క్రియేటివిటీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు పిచ్చి గీతల దినోత్సవం ఏంటని కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ప్రతీ ఏడాది మార్చ్ 27నాడు అంతర్జాతీయ పిచ్చిగీతల దినోత్సవం జరుపుతారు. ఈ దినోత్సవం ఎలా మొదలైంది? ఐయామ్ నాట్ జస్ట్ స్క్రిబిల్ అనే పుస్తక రచయిత డియానీ ఆల్బర్, 2019లో అంతర్జాతీయ పిచ్చిగీతల దినోత్సవాన్ని మొదలెట్టాడు. ఆయన రాసిన పుస్తకంలోని స్క్రిబిల్ అనే పాత్ర, పిల్లల్లోని సామర్థ్యాన్ని క్రియేటివిటీ ద్వారా వెలికి తీసి, వారిలో దయాగుణాన్ని పెంపొందిస్తుంది. పిచ్చి గీతలనేని ఒక ఊహాలోకాన్ని సృష్టించి క్రియేటివిటీని పెంచుతాయి. దీనికోసం తల్లిదండ్రులు పిల్లల చేత పిచ్చిగీతలు గీయించాలి. అందుకోసం తల్లిదండ్రులు తమ సమయాన్ని వెచ్చించాలి.
పిల్లల చేత పిచ్చిగీతలతో ఆడించే ఆటలు
కళ్ళు మూసుకుని పిచ్చిగీతలు: మీ పిల్లలకు కొన్ని పేపర్లు, కలర్ స్కెచెస్ ఇవ్వండి. వారిని కళ్ళు మూసుకోమని చెప్పి, మీరు చెప్పే మాటల ప్రకారం, పేపర్ మీద బొమ్మ గీయమని చెప్పండి. గీతలతో బొమ్మలు: ఒక పేపర్ మీద ఇష్టం వచ్చినట్టుగా గీతలు గీయండి. దాన్ని మీ పిల్లలకు అందించి ఆ గీతలను అధారం చేసుకుని ఒక బొమ్మను గీయమనండి. జ్ఞాపకశక్తిని పెంచే పిచ్చిగీతలు: పేపర్ మీద ఏవో పిచ్చిగీతలు గీసి వాటిని మీ పిల్లలకు చూపించండి. మీరెలా గీసారో అలాగే మీ పిల్లలను గీయమని చెప్పి, మీరు గీసిన దాన్ని మీ దగ్గరే పెట్టుకోండి. అప్పుడు వాళ్ళు, మీరు గీసిన దాన్ని ఎంతలా జ్ఞాపకం ఉంచుకున్నారో అర్థమవుతుంది.