Pure Ghee :నెయ్యిలో 'ఎస్ వాల్యూ' ఏంటి.. ఒరిజినల్,డూప్లికేట్ నెయ్యిని ఎలా గుర్తించాలి..?
తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై నెయ్యి సంబంధిత కల్తీ ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఎన్.డి.డి.బి. ఇచ్చిన రిపోర్టులో ఎస్-వాల్యూలో తేడాలు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో లడ్డూ ప్రసాదం నాణ్యతపై సందేహాలు వచ్చాయి. ఎన్.డి.డి.బి (నేషనల్ డైటరీ డేటాబేస్) రిపోర్టులోని వివిధ అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రత్యామ్యాయంగా పనిచేసే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు ప్రముఖ మీడియా హౌస్ నిర్వహించిన చర్చలో, వారు కొన్ని కీలక వివరాలను పంచుకున్నారు.
అసలు ఇంతకీ ఎస్ వాల్యూ అంటే ఏమిటి?
ఎస్-వాల్యూ అనేది నెయ్యిలోని కొవ్వు నాణ్యతను అర్థం చేసుకునేందుకు నిర్వహించే రసాయన పరీక్ష. ఇందులో "ఎస్" అనేది స్టాండర్డ్ అని సూచిస్తుంది. ఐఎస్ఓ నిబంధనల ప్రకారం, గేదె పాలతో, ఆవు పాలతో చేసిన నెయ్యి ఎస్-వాల్యూలు వేరుగా ఉంటాయి, కాబట్టి వీటిని ఒకే విధమైన సమీకరణంతో లెక్కించడం సాధ్యం కాదు. గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (జీఎల్సీ) పరికరం ఉపయోగించి స్వచ్ఛమైన ఆవు, గేదె నెయ్యి నాణ్యతను కచ్చితంగా నిర్ధారించవచ్చు. స్వచ్ఛమైన నెయ్యిలోని కొవ్వుల శాతం 98.05-104.32% మధ్య ఉంటే, అది ఎస్-వాల్యూ పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది. ఆ పరిమాణం బయటికి వచ్చినా, నెయ్యిలో కల్తీ జరుగుతుందని అర్థం. అందువల్ల, ఎస్-వాల్యూను కొవ్వుల శాతాన్ని కొలిచేందుకు స్టాండర్డ్ వాల్యుగా నిర్ణయించారు.
ఎస్-వాల్యూ వర్గీకరణ
1. టోటల్ ఎస్-వాల్యూ: 98.05-104.32% 2. ఎస్2-వాల్యూ: 98.05-101.95% (సోయాబీన్, సన్ ఫ్లవర్ వంటి కల్తీ) 3. ఎస్3-వాల్యూ: 99.42-100.58% (కొబ్బరి లేదా పామ్ కార్నల్ ఫ్యాట్ కలిసినట్లు) 4. ఎస్4-వాల్యూ: 95.90-104.10% (పామాయిల్ ఉన్నట్లు) 5. ఎస్5-వాల్యూ: 97.96-102.04% (లాడ్ కలిసినట్లు) నాణ్యత నిర్ధారణ కోసం అనేక పరీక్షలు నెయ్యి నాణ్యతను తెలుసుకోవడానికి వివిధ ప్రయోగశాలా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం 50-55 పరీక్షల ద్వారా నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, గ్యాస్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ పరీక్ష నెయ్యిలో కల్తీ ఉందా అని నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.
ప్రాముఖ్యమైన పరీక్షలు
1. బౌడౌయిన్ పరీక్ష: నెయ్యిలో నువ్వుల నూనె కల్తీని నిర్ధారించేందుకు. 2. రైచర్ట్-మెయిస్సెల్ విలువ (RM Value): అస్థిర కొవ్వు ఆమ్లాలను కొలుస్తుంది. 3. పాలలో కొవ్వు: పాలలో ఉన్న కొవ్వు శాతాన్ని అంచనా వేస్తుంది. 4.అయోడిన్ టెస్ట్: నెయ్యికి అయోడిన్ చేర్చినప్పుడు రంగు మారితే కల్తీ నెయ్యి అని అర్థం. 5. సపోనిఫికేషన్ వాల్యూ: నెయ్యిలో గట్టిదనంలాంటి లక్షణం ఉందా అని చెక్ చేస్తుంది. కల్తీ నెయ్యిని గుర్తించడమెలా? స్వచ్ఛమైన నెయ్యి: గేదె,ఆవుల పాలతో తయారవుతుంది. కల్తీ నెయ్యి: కూరగాయల నూనె, జంతు కొవ్వులు, రంగులు మరియు రసాయనాలు కలిపి తయారవుతుంది.
ఇంట్లో కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలంటే..
1. నెయ్యి వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారితే అది కల్తీ. 2. అరచేతిలో వేస్తే కరుగుతుంటే అది కల్తీ. 3. తెల్ల కాగితంపై మలినాలు ఏర్పడితే అది కల్తీ. 4. స్వచ్ఛమైన నెయ్యి మృదువుగా ఉంటుంది; కల్తీ నెయ్యి తేలిపోతుంది. 5. గోరువెచ్చని నీటిలో వేస్తే కరిగితే అది స్వచ్ఛమైనది; గడ్డకట్టినట్లయితే కల్తీ. 6. కల్తీ నెయ్యి రుచి చేదుగా ఉంటుంది. నెయ్యిలో కల్తీ చేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.. పౌష్టికాహార లోపం, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.