Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ
తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు కలపడం గురించి ఇటీవల వచ్చిన వార్తలు భక్తులను కలవరపరిచాయి. ఈ వార్తల నేపథ్యంలో, అనేక మంది భక్తులు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిపాలనపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది, అందులో ఒక మహిళా భక్తురాలు తనకు లడ్డూ ప్యాకెట్‌లో గుట్కా ప్యాకెట్ కనిపించిందని వీడియో ద్వారా తెలియజేసింది.
సంఘటన వివరాలు
తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కొల్లగూడెం ప్రాంతానికి చెందిన పద్మావతి అనే మహిళా భక్తురాలు తిరుపతి ఆలయంలో లడ్డూ కొనుగోలు చేసినప్పుడు, అందులో గుట్కా ప్యాకెట్ ఉన్నట్లు చెప్పారు. ఆమె ఈ విషయాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై తిరుపతి దేవస్థానం స్పందించి, విచారణ జరిపేందుకు కొల్లగూడెం వెళ్లనుందని సమాచారం.
గత నివేదికలు
ఇదిలా ఉండగా, గతంలో కూడా లడ్డూ తయారీలో నెయ్యిలో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఆ ఆరోపణలను బహిరంగంగా చేయగా, గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ నిర్వహించిన పరిశీలనలో వాటికి సమర్థన లభించింది. అందులో, నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వంటి పదార్థాలు ఉండటం తేలింది. ఈ నేపథ్యంలో, లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన దిండిగల్ కంపెనీని దేవస్థానం బోర్డు బ్లాక్‌లిస్టులో చేర్చింది.
దర్యాప్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం కర్ణాటక ప్రభుత్వ సంస్థ నందిని నుంచి నెయ్యిని కొనుగోలు చేస్తోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడినట్లు విచారణలో తేలిన తర్వాత,ఆలయంలో శాంతి హోమం నిర్వహించి,పరిసరాలను శుద్ధి చేశారు. అర్చకులు భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వామివారి దర్శనానికి విచ్చేయవచ్చని తెలిపారు.
లడ్డూలో గుట్కా ప్యాకెట్
ఆరోపణపై టీటీడీ క్లారిటీ
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. టీటీడీ ప్రకారం,సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందని జరుగుతున్నప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టత ఇచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు ఉందని కొన్ని వదంతులు వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలో లడ్డూ తయారీ చాలా భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల చేత ప్రతిరోజూ లక్షలాది లడ్డూలు తయారవుతాయని వివరించారు. ఇంకా, ఈ లడ్డూ తయారీ పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు. ఇలాంటి కఠినమైన నిబంధనలు ఉండే వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని కోరారు.