LOADING...
Friendship Day 2025: బాల్య స్నేహాలు కొనసాగితే.. లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! 
బాల్య స్నేహాలు కొనసాగితే.. లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Friendship Day 2025: బాల్య స్నేహాలు కొనసాగితే.. లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

''గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.. ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది..'' - బాలమిత్రుల కథ సినిమాలోని ఈ ఎవర్ గ్రీన్ పాటను వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాలం గడుస్తున్నా కూడా ఈ పాటకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదంటే, స్నేహానికి అది ఎంతటి మానవీయ విలువను చాటిందో అర్థం చేసుకోవచ్చు. స్కూల్‌లో ఇద్దరు పిల్లలు పాడే ఈ పాట, వారి మధ్య ఉన్న మధురమైన స్నేహ బంధాన్ని ఎంతో చక్కగా వివరించింది. ఈ పాటను ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే.. ఇవాళ అంతర్జాతీయ మిత్రుల దినోత్సవం. ప్రపంచమంతా ఈ రోజును ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకుంటోంది.

వివరాలు 

బాల్యస్నేహం గొప్పతనం గురించి కథలు, సినిమాలు

స్నేహం అంటేనే కన్నతల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమకు సాటిగా భావించవచ్చు. కొందరైతే దానికంటే గొప్పగా కూడా భావిస్తారు. ముఖ్యంగా బాల్యంలో ఏర్పడే స్నేహబంధాలు ఎంత గొప్పవో చెప్పాల్సిన పనిలేదు. చిన్ననాటి స్నేహం గొప్పతనాన్ని చెప్పే కథలు, సినిమాలు మనకు చాలా కనిపిస్తాయి. బాల్య స్నేహం కొనసాగితే దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు . అవేంటో స్నేహితుల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

వివరాలు 

బాల్య స్నేహాలు - మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకాలు 

ఫ్రెండ్స్ అని అనగానే మనకు వెంటనే గుర్తుకురావాల్సింది స్కూల్ స్నేహితులే. ఎందుకంటే ఆ బంధాలు నిత్యమైనవిగా మారతాయి. ముఖ్యంగా బాల్యంలో ఏర్పడే స్నేహాలు అత్యంత విలువైనవిగా నిలుస్తాయి. అలాంటి స్నేహాలను నిండు జీవితాంతం కొనసాగించగలిగితే, మానసిక ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. భావోద్వేగాలకు ఆధారంగా నిలిచే బాల్య మిత్రులు చిన్ననాటి మిత్రులు మన భావోద్వేగాలను, మన లోతైన మనసు స్థితులను బాగా అర్థం చేసుకోగలగుతారు. వారితో ఉన్న స్నేహ బంధం ఎప్పటికి కొనసాగితే మనలో ఒత్తిడిని తగ్గించే గుణం పెరుగుతుంది. ఆందోళనతో ఉండే సమయంలో వారు మనకు మానసికంగా ఓ ధైర్యాన్ని ఇస్తారు.

వివరాలు 

వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకునే సంబంధం 

చిన్ననాటి స్నేహితులతో కొనసాగే స్నేహం వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వారి ఆలోచనలు, ప్రవర్తన, లక్ష్యాలు మొదలైన వాటిపై స్పష్టత పెరుగుతుంది. ఈ అవగాహన వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒత్తిడిని తగ్గించే సహజ మార్గం బాల్యంలో గడిపిన మధురమైన క్షణాలు, ఆ మిత్రులతో తిరిగి గడిపే సమయాలు మనకు నిదానంగా ఒత్తిడిని తగ్గించగలుగుతాయి. మన సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తులతో మాట్లాడటం వలన మనలో తేలికనుభూతి ఏర్పడుతుంది.

వివరాలు 

భావోద్వేగాలకు మద్దతు 

బాల్య మిత్రులతో సుదీర్ఘ సంబంధం ఉన్నప్పుడు, మన భావోద్వేగాలకు వారు మద్దతుగా నిలుస్తారు. జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, పక్కన ఒక నమ్మకమైన స్నేహితుడు ఉన్నాడని తెలుసుకోవటం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నోస్టాల్జియా గతంలో జరిగిన సంఘటనలను చిన్ననాటి మిత్రులతో గుర్తు చేసుకోవడం వల్ల ఒక ప్రత్యేకమైన మానసిక తృప్తి కలుగుతుంది. ఇది "నోస్టాల్జియా"గా పిలవబడుతుంది. ఈ భావన మనలో ఆనందాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది.

వివరాలు 

స్కిల్స్ పెరుగుతాయి. . 

స్నేహితులతో కొనసాగే దీర్ఘకాలిక బంధాలు వ్యక్తిగతంగా మాత్రమే కాక, సామాజికంగా కూడా మన నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఈ బంధాలు ఆరోగ్యకరమైన పరిసరాలను కల్పించి, మన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. మీ చిన్ననాటి స్నేహితులను గుర్తు చేసుకోండి. వారికి ఫోన్ చేయండి.. లేదా కలవండి. ఆ బంధాలను మరింత బలంగా కొనసాగించండి. ఎందుకంటే అవే మీకు మానసిక ఆరోగ్యం ఇచ్చే విలువైన మూలధనం. స్నేహానికి శుభాకాంక్షలు! హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!