Democracy Perception Index 2026: ప్రపంచంలో అత్యంత స్నేహపూర్వక దేశాల ర్యాంకింగ్ విడుదల.. భారత్ స్థానం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ దేశాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను అంచనా వేస్తూ రూపొందించిన డెమోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్-2026 సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. 85 దేశాలకు చెందిన 46 వేల మందికిపైగా పాల్గొన్న ఈ సర్వేలో ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన, స్నేహపూర్వక దేశాల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో భారత్ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. సర్వే ప్రకారం స్విట్జర్లాండ్,కెనడా దేశాలు +36 నెట్ పర్సెప్షన్ స్కోర్‌తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాయి. మర్యాద, పరస్పర గౌరవం, ఆతిథ్య సత్కారం వంటి లక్షణాల కారణంగా ఈ దేశాలకు అధిక గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
'ఒమోటెనాషి' సంస్కృతి జపాన్‌కు ప్రత్యేక గుర్తింపు
+34 స్కోర్‌తో జపాన్ రెండో స్థానంలో నిలిచింది. అతిథులను గౌరవంగా చూసే 'ఒమోటెనాషి' సంస్కృతి జపాన్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని సర్వే వెల్లడించింది. అనంతరం +33 స్కోర్‌తో స్వీడన్ స్థానం దక్కించుకుంది. మర్యాదపూర్వక ప్రవర్తన, సంతోషకర జీవనశైలి కారణంగా స్వీడన్‌కు మంచి గుర్తింపు లభించింది. +32 స్కోర్‌తో ఇటలీ, నార్వే తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఆహారం, కుటుంబ బంధాలు, అతిథి మర్యాదలకు ప్రసిద్ధి చెందిన ఇటలీతో పాటు ప్రపంచంలోని అత్యంత సంతోషకర దేశాల్లో ఒకటైన నార్వే కూడా ఈ జాబితాలో ముందంజలో ఉంది. +31 స్కోర్‌తో స్పెయిన్ తరువాతి స్థానాన్ని దక్కించుకుంది. అక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా ఉండటం ఈ ర్యాంకుకు కారణమైంది.
వివరాలు
28వ స్థానంలో భారత్
ఇక +30 స్కోర్‌తో ఆస్ట్రేలియా, డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ దేశాలు ఒకే స్థానాన్ని పంచుకున్నాయి. మరోవైపు, భారత్‌కు -2 నెట్ పర్సెప్షన్ స్కోర్ నమోదైంది. దీంతో భారత్ సుమారు 28వ స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. ఈ స్కోర్‌కు ఖచ్చితమైన కారణాలను సర్వే నిర్వాహకులు వెల్లడించలేదు. అయితే భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుడిగా భావించే సంప్రదాయం ఉన్నప్పటికీ, అపరిచితులతో అధికారిక మర్యాదపూర్వక సంభాషణలు తక్కువగా ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
రష్యాకు -11 స్కోర్
నెగెటివ్ స్కోర్ పొందిన ఇతర దేశాల్లో సౌదీ అరేబియా (-1), కొలంబియా (-2), యెమెన్, బంగ్లాదేశ్, లెబనాన్, క్యూబా, నైజీరియా (-3), వెనిజులా, మయన్మార్, బెలారస్ (-5), పాకిస్థాన్ (-9) ఉన్నాయి. రష్యాకు -11 స్కోర్ నమోదైంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి సర్వేలు పరిమిత సంఖ్యలో పాల్గొన్న వారి అభిప్రాయాల ఆధారంగా మాత్రమే రూపొందించబడతాయి. అందువల్ల 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశం గురించి పూర్తి చిత్రాన్ని ఇవి ప్రతిబింబించకపోవచ్చని పేర్కొంటున్నారు.