Indian Mango: అమెరికాలో భారత మామిడి జాతర.. ఉచితంగా రుచి చూసేందుకు భారీ క్యూ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ మరోసారి అమెరికాలో కనిపించింది. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక మామిడి ఉత్సవానికి వందలాది మంది తరలివచ్చి భారతీయ మామిడి రుచులను ఆస్వాదించారు. అల్ఫాన్సో,కేసర్,చౌన్సా వంటి ప్రముఖ రకాల మామిడి పండ్లను సందర్శకులకు ఉచితంగా అందించడంతో కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శిల్ పటేల్‌తో పాటు పలువురు స్థానిక యువకులు కలిసి ఈ మామిడి వేడుకకు రూపకల్పన చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో వాలంటీర్లు తాజా మామిడి పండ్లను అక్కడికక్కడే కోసి, శుభ్రంగా ముక్కలుగా చేసి సందర్శకులకు అందించారు.
వివరాలు
నాలుగేళ్లుగా మామిడి ఉత్సవం
భారతీయ మామిడి పండ్లపై తమకున్న అభిమానాన్ని పంచుకునేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో అమల్లో ఉన్న దిగుమతి నిబంధనల కారణంగా భారతీయ మామిడి పండ్లు సాధారణ మార్కెట్లలో ఎక్కువగా అందుబాటులో ఉండవు. దీంతో అరుదుగా లభించే ఈ ప్రత్యేక రకాల మామిడి పండ్లను రుచి చూసేందుకు ప్రవాస భారతీయులతో పాటు అమెరికన్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత నాలుగేళ్లుగా ఈ మామిడి ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుండగా, ప్రతి ఏడాది దీనికి ఆదరణ మరింత పెరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.
వివరాలు
స్థానిక ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం
ఈ మ్యాంగో పార్టీపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఉచితంగా పండ్లు అందిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడటంపై కొందరు సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు, భారతీయ సంస్కృతి, ఆహార సంప్రదాయాలను విదేశాల్లో పరిచయం చేసే ఇటువంటి కార్యక్రమాలను చాలామంది ప్రశంసించారు. ఈ వేడుక ప్రవాస భారతీయులకు స్వదేశంలోని తీయని జ్ఞాపకాలను గుర్తు చేయగా, అమెరికన్లకు భారత మామిడి విశిష్టతను పరిచయం చేసింది.