అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ప్రతీ ఏడాది అక్టోబర్ 17వ తేదీన జరుపుకుంటారు. పేదరికం కారణంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పేదరికం వల్ల వారి ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. అందుకే పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో ప్రతీ ఏడాది పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం 2022 సంవత్సరం చివరి నాటికి ప్రపంచ జనాభాలో 670మిలియన్ల మంది పేదరికంతో బాధపడుతున్నారు. అంటే 8.4% జనాభా పేదరికంలో ఉన్నారు. అంతేకాదు 2030 నాటికి ప్రపంచ జనాభాలో 7శాతం, అంటే 575 మిలియన్ల మంది అత్యంత పేదరికంతో బాధపడతారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
1987నుండి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం మొదలు
అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం 1987వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక థీమ్ తో ప్రపంచ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది, సరైన పని, సామాజిక రక్షణ అనే థీమ్ తో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుతున్నారు. పేదరికం కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే పేదరికాన్ని నిర్మూలించే అనేక కార్యక్రమాలను ప్రోత్సహించడాన్ని ఈరోజు గుర్తు చేస్తారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ఆర్థికంగా బలంగా తయారవడానికి కావలసిన అనేక విషయాలను ఈరోజు వెల్లడి చేస్తారు. అంతేకాదు సమాజంలో ప్రతీ ఒక్కరూ గౌరవంగా జీవించే పరిస్థితులను కల్పించడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.