LOADING...
USA-Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధం.. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధనౌక!
ఇరాన్‌పై దాడికి సిద్ధం.. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధనౌక!

USA-Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధం.. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధనౌక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌' తాజాగా ఈ ప్రాంతానికి చేరుకోవడం గమనార్హం. దీంతో ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న భయాందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. అబ్రహం లింకన్‌తో పాటు యూఎస్‌ఎస్‌ ఫ్రాంక్‌ ఈ. పీటర్సన్‌ జూనియర్‌, యూఎస్‌ఎస్‌ స్ప్రూయాన్స్‌ అనే డెస్ట్రాయర్లు, అలాగే 'యూఎస్‌ఎస్‌ మిషెల్‌ మార్ఫీ' కూడా పశ్చిమాసియా జలాలకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా 'సెంట్రల్‌ కమాండ్‌' (US Central Command) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ నౌకలను మోహరించినట్లు వెల్లడించింది.

Details

ఆందోళనలు మరింత తీవ్రరూపం

ఈ నౌకా దళం ఇరాన్‌ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సమాచారం. దీంతో ఇప్పటికే అక్కడ మోహరించిన అమెరికా సైనిక బలానికి మరింత పెరుగుదల జరిగినట్లైంది. ఇదిలా ఉండగా.. పెంటగాన్‌ పశ్చిమాసియా ప్రాంతానికి మరిన్ని ఫైటర్‌ జెట్‌లు, మిలిటరీ కార్గో విమానాలు తరలించే యోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఆందోళనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్‌ ట్రంప్‌' బహిరంగంగా నిలిచారు. నిరసనకారులపై ఇరాన్‌ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టినా అమెరికా జోక్యం చేసుకుంటుందని ఆయన హెచ్చరించారు.

Details

అమెరికా చర్చలకు సిద్ధం..!

ఇదే క్రమంలో ఇరాన్‌ దిశగా భారీగా తమ సైన్యాన్ని తరలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ చర్చలకు ముందుకొస్తే అమెరికా అందుకు సిద్ధంగా ఉందని అగ్రరాజ్యానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. చర్చలు ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు ఏమిటో టెహ్రాన్‌కు ఇప్పటికే స్పష్టంగా తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement