#InternationalYogaDay: యోగా ఎందుకు చేయాలి? పతంజలి చెప్పిన జీవన రహస్యాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా నేడు యోగాకు అపారమైన ఆదరణ లభిస్తోంది. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన ఈ జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత సదస్సులో భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి చాటిచెప్పగా, 2014 సెప్టెంబరు 27న ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి వేదికగా అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు విశేష స్పందన లభించడంతో 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీంతో యోగా విశ్వవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంది.
వివరాలు
త్రికరణశుద్ధికి యోగమే మార్గం
'మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం మహాత్మానాం' అనే ఆర్యోక్తి మనిషి జీవిత సారాన్ని వివరిస్తుంది. మనసులో అనుకున్నదే మాట్లాడి, చెప్పినదే ఆచరించే వారినే మహాత్ములుగా భావిస్తారు. దీన్నే త్రికరణశుద్ధి అంటారు. అంటే మనసు, మాట, చేతల్లో స్వచ్ఛత ఉండటం. అలాంటి జీవనం నిజాయతీ, క్రమశిక్షణ, సమైక్యతతో కూడి ప్రశాంతతను, ఆనందాన్ని అందిస్తుంది. ఈ త్రికరణశుద్ధిని సాధించేందుకు మన పూర్వీకులు గొప్ప మార్గాలను చూపించారు. చిత్తశుద్ధికి పతంజలి యోగశాస్త్రాన్ని, వాక్‌శుద్ధికి పాణిని వ్యాకరణాన్ని, దేహశుద్ధికి చరకుడు ఆయుర్వేదాన్ని అందించారు. భారతీయ జ్ఞాన సంపదలో యోగశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది.
వివరాలు
మనసును జయించడమే నిజమైన విజయం
మనిషికి అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలతో పాటు మనసు కలిపి మొత్తం పదకొండు ఇంద్రియాలు ఉంటాయి. వీటిలో అత్యంత చంచలమైనది మనసే. అందుకే పెద్దలు 'మనోజయః ఏవ మహాజయః' అని చెప్పారు. అంటే మనసును జయించడమే నిజమైన విజయం. శత్రువులను బలంతో జయించడం కంటే వారి మనసును గెలుచుకోవడం గొప్ప విషయం. మనసు స్వభావం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. 'వృత్తి ప్రవాహ ఇతి చిత్తః' అనే భావం అదే చెబుతుంది. ప్రవహించే నదిని పూర్తిగా ఆపలేకపోయినా ఆనకట్ట కట్టి దిశ మార్చినట్లే, మనసును
వివరాలు
అష్టాంగ యోగం... సంపూర్ణ జీవన విధానం
పతంజలి మహర్షి అష్టాంగ యోగం ద్వారా సంపూర్ణ మనోనిగ్రహాన్ని వివరించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది దశలతో కూడిన ఈ విధానం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతుంది. యమ సమాజంలో క్రమశిక్షణతో జీవించేందుకు అవసరమైన అహింస, సత్యం, అస్తేయం, ఆస్తిక్యం, స్థైర్యం, క్షమ వంటి విలువలను యమ బోధిస్తుంది. సమాజంతో సఖ్యతగా ఎలా మెలగాలో నేర్పుతుంది. నియమ పరోపకారం, సంతృప్తి, అంతఃబాహ్య శౌచం, శ్రద్ధ, జపం, సహనం వంటి సద్గుణాలను అలవర్చుకుని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి నియమ ఉపయోగపడుతుంది. ఆసనం శరీరాన్ని స్థిరంగా, సుఖంగా ఉంచే భంగిమలే ఆసనాలు. ఇవి శారీరక బలం, ఆరోగ్యం, శరీర శుద్ధి, దీర్ఘాయుష్షును పెంచుతాయి.
వివరాలు
ప్రాణాయామం
ప్రాణం అంటే జీవశక్తి, ఆయామం అంటే విస్తరించడం. శ్వాసను క్రమబద్ధంగా నియంత్రించే సాధనే ప్రాణాయామం. ఇది శరీరంలోని దోషాలను తగ్గించి శక్తిని పెంపొందిస్తుంది. ప్రత్యాహారం మనసును, బుద్ధిని ప్రశాంతంగా ఉంచి బాహ్య విషయాల నుంచి ఇంద్రియాలను మరల్చి నియంత్రించడమే ప్రత్యాహారం. ధారణ ఒకే విషయంపై మనసును కేంద్రీకరించి ఏకాగ్రతను పెంపొందించుకోవడం ధారణ. పరమాత్మ, ఒక బిందువు, చిహ్నం లేదా ఏదైనా వస్తువుపై దృష్టిని నిలిపే సాధన ఇది. ధ్యానం ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడంతో పాటు అనేక శారీరక సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ధ్యాన ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి డిసెంబరు 21ను అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది.
వివరాలు
సమాధి
ధ్యాన స్థితిలో సాధకుడు, ధ్యానం, ధ్యేయం మూడు వేర్వేరుగా ఉంటాయి. ఈ మూడూ ఏకమయ్యే స్థితినే సమాధి అంటారు. ఇందులో వ్యక్తి అహంకారం, కోరికల నుంచి విముక్తి పొంది తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇది అనంతమైన ఆనందానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతీక.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా యోగాకి పెరుగుతున్న ఆదరణ
సింహం, పులి, ఏనుగు వంటి క్రూర జంతువులు కూడా శిక్షణతో మచ్చిక అవుతాయి. అలాగే యోగ సాధనతో మనసు కూడా మనిషికి వశమవుతుంది. అప్పుడే మనిషి తనలోకి తాను తొంగిచూసుకుని సమస్థితిని పొందగలుగుతాడు. 'అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి' అనే వసుధైక కుటుంబ భావనకు యోగమే ప్రతిరూపం. ఇది కేవలం వ్యాయామం కాదు,ఒక సంపూర్ణ జీవన విధానం. సుమారు అయిదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా వేద వాఙ్మయంలోని ఆరు దర్శనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధునిక కాలానికి అనుగుణంగా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లడం అవసరం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తున్నారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా యోగాకి పెరుగుతున్న ఆదరణ
ఆరోగ్య రంగంతో పాటు భారీ వ్యాపార రంగంగానూ యోగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక యోగా పరిశోధకుడు స్వామి కువలయానంద చేసినట్లుగా మరిన్ని పరిశోధనలు చేసి యోగాసనాలను ఆధునిక శారీరక వ్యాయామాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. యోగా మతాలకు, భాషలకు, ప్రాంతాలకు అతీతమైన జీవన తత్వం. అందుకే నేడు దాదాపు అన్ని దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ యోగాను ఆచరిస్తున్నాయి. భారతదేశంలో పుట్టిన ఈ మహోన్నత సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమే.