
Inverter AC vs Non-Inverter AC: ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ACలు.. వేసవి కాలంలో ఏది బెస్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి దగ్గరపడుతున్నకొద్దీ, కూలర్లు,ఎయిర్ కండిషనర్ల (ACలు) వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
మార్చి, ఏప్రిల్ నెలల్లోనే తేలికపాటి ఉష్ణోగ్రతల సమయంలోనూ కూలర్లకు మంచి డిమాండ్ కనిపించింది.
ఇక మే నెలకి ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో, ఏసీ అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
మీరు కొత్త ఎయిర్ కండిషనర్ కొనాలనుకుంటే, కొన్ని ముఖ్యమైన అంశాలపై అవగాహన తప్పనిసరి.
ఎవరైనా AC కొనేటప్పుడు ఓ సాధారణ సందిగ్ధతను ఎదుర్కొంటారు. ఇన్వర్టర్ AC తీసుకోవాలా లేక నాన్-ఇన్వర్టర్ AC మంచిదా? ఈ రెండు రకాల మధ్య తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
వివరాలు
మార్కెట్లో రెండు రకాల ఏసీలు
చాలా మంది ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ (స్టాబిలైజర్) సహాయంతో ఎయిర్ కండిషనర్ నడిపించవచ్చని భావిస్తారు.
కానీ "ఇన్వర్టర్" అన్న పదం ఇక్కడ వేరు. ఇది యూనిట్‌లో ఉపయోగించే ప్రత్యేక సాంకేతికతకు సూచన.
కాబట్టి ఎయిర్ కండిషనర్ కొనేటప్పుడు కేవలం బ్రాండ్‌నే కాకుండా, కూలింగ్ సామర్థ్యం, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
తప్పుడు రకం ఏసీని ఎంపిక చేసుకుంటే గది తగినంతగా చల్లకాకపోవడం, అధిక విద్యుత్ బిల్లులు రావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ప్రస్తుతం మార్కెట్లో ప్రధానంగా రెండు రకాల ఏసీలు లభ్యమవుతున్నాయి. ఇన్వర్టర్ ACలు , నాన్-ఇన్వర్టర్ ACలు.
మీకు ఏది ఎక్కువగా ఉపయోగకరమవుతుందో, ఏది ఎక్కువగా డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుందో తెలుసుకోవాలి.
వివరాలు
ఇన్వర్టర్ ACలు అంటే ఏమిటి?
ఇన్వర్టర్ ACలు అధునాతన టెక్నాలజీతో పనిచేస్తాయి, ఇవి కంప్రెసర్ వేగాన్ని నియంత్రించగలగే విధంగా రూపొందించబడ్డాయి.
మీరు ACని ఆన్ చేసినప్పుడు, ఇది గదిని వేగంగా చల్లబరుస్తుంది. తర్వాత కంప్రెసర్‌ను పూర్తిగా ఆపేయకుండా, వేగాన్ని తగ్గిస్తూ పనిచేస్తుంది.
ఈ విధానం వల్ల కంటిన్యూగా చల్లటి గాలిని సరఫరా చేస్తూ, తక్కువ విద్యుత్తుతో మెరుగైన కూలింగ్‌ను అందిస్తుంది.
సారాంశంగా చెప్పాలంటే, ఇన్వర్టర్ AC ఎప్పుడూ ఆన్ స్టేట్‌లోనే ఉండి, అవసరాన్ని బట్టి తన పనితీరును మారుస్తుంది.
వివరాలు
నాన్-ఇన్వర్టర్ ACలు ఎలా పనిచేస్తాయి?
నాన్-ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్‌లో కంప్రెసర్ పూర్తిగా ఆన్ లేదా పూర్తిగా ఆఫ్ స్థితిలోనే ఉంటుంది.
మీరు AC ఆన్ చేసినప్పుడు, గది కావలసిన ఉష్ణోగ్రతకు చేరేవరకు కంప్రెసర్ నడుస్తుంది.
ఒకసారి టార్గెట్ టెంపరేచర్‌కు చేరాక, అది ఆగిపోతుంది. ఆ తరువాత ఉష్ణోగ్రత మళ్లీ పెరిగినప్పుడు తిరిగి కంప్రెసర్ ఆన్ అవుతుంది.
ఈ తరచూ ఆన్-ఆఫ్ అయ్యే ప్రక్రియ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి, బిల్లులు కూడా అధికంగా వస్తాయి.
వివరాలు
కూలింగ్ సామర్థ్యం విషయానికి వస్తే...
ఇన్వర్టర్ ACలు గది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే విషయంలో మెరుగ్గా పనిచేస్తాయి.
గదిలో చల్లదనం అవసరమైన స్థాయిలో ఉన్నప్పటికీ, కంప్రెసర్ తక్కువ వేగంతో పని చేస్తూ గాలిని సమతుల్యంగా సరఫరా చేస్తుంది.
నాన్-ఇన్వర్టర్ ACలు గదిని తొందరగా చల్లబరిచే సామర్థ్యం కలిగి ఉన్నా, అవి తరచూ ఆన్-ఆఫ్ అవ్వడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతాయి. ఇది కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
మీ లక్ష్యం విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడం,గదిలో స్థిరమైన ఉష్ణోగ్రతను నిలుపుకోవడం అయితే, ఇన్వర్టర్ ACని ఎంపిక చేయడం ఉత్తమమైన నిర్ణయం అవుతుంది.